Union Minister Kishan Reddy: కేంద్రంలో అధికారం ఉంది.. బోలెడంతా పరపతి ఉంది.. మందీ మార్బలం చేతిలో ఉంది.. సీబీఐ, ఈడీ, ఇంటెలిజెన్స్ లాంటి ఎన్నో నిఘా వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి. అయినా కూడా తెలంగాణలో అధికార బీజేపీ పప్పులు ఉడకలేదు. కేసీఆర్ స్కెచ్ లో బీజేపీ అడ్డంగా బుక్కైపోయింది. మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుమాల్ లీక్ అయిపోయింది. ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఆఫర్ చేసి డబ్బుల సంచులతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దొరికిపోయారు.

ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఎక్కడి వారు అని అందరూ ఆరాతీస్తే.. వారంతా బీజేపీ సన్నిహితులు అని తేలింది. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పిస్తే ఆ పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిని బీజేపీ గెలుపుపై జనాల్లో నమ్మకం కలుగుతుందని.. బీజేపీకి మునుగోడులో గెలుపు సాధ్యమవుతుందని ఈ స్కెచ్ గీసినట్టు సమాచారం. నిందితుల్లో ఒకరైన నందకుమార్ అనునిత్యం హై ప్రొఫైల్ వ్యక్తులతో తిరిగి డీల్స్ కుదరచడంలో దిట్ట. గతంలో హైదరాబాద్ నగర పరిధికి చెందిన ఎమ్మెల్యేకు మొయినాబాద్ శివారులో ఫామ్ హౌస్ కూడా సమకూర్చి పెట్టాడని, ఇందుకు ప్రతిగా ఆయన సదరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో తనకు అనుకూలమైన వ్యక్తికి మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నాడని వినికిడి. ఇక డీల్ ఏదైనా సరే దాన్ని పూర్తి చేసే వరకు నందు ప్రయత్నిస్తూనే ఉంటాడని పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డితో నందుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నందూతో కిషన్ రెడ్డి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో టిఆర్ఎస్ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఆ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు నందుతో అత్యంత సమితంగా ఉంటారని తెలుస్తోంది.

వాస్తవానికి ఫామ్ హౌస్ కు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ చెందిన ఎంపీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సదర్ ఎంపీ కూడా ఈ మీటింగ్ కు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో కుదరని చెప్పినట్టు తెలుస్తోంది.. అంతేకాదు మరో ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల రాలేదన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక నందకుమార్ కు హైదరాబాద్ శివారు చంద్ర టిఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

డబ్బులతో పట్టుబడిన నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావడం బీజేపీ నేతలే ఈ స్కెచ్ గీశారనడానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి అయితే బీజేపీతో నేరుగా సంబంధాలున్నాయి. ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామీజీతో కూడా కిషన్ రెడ్డికి దగ్గర సంబంధాలున్నాయి. కిషన్ రెడ్డి-సింహయాజీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పట్టుబడ్డ ముగ్గురు నిందితులు కిషన్ రెడ్డి, రాజ్ నాథ్ సింగ్ సహా బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. వారితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలను కొనేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసి రాజకీయ లబ్ధి పొందాలన్న బీజేపీకి ఆదిలోనే హంసపాదు పడినట్టైంది. ఈ హోల్ ఎపిసోడ్ లో బీజేపీ తాను తీసిన గోతిలోనే తాను పడ్డట్టు అయ్యింది. క్లీన్ ఇమేజ్ ఉన్న కిషన్ రెడ్డి, రాజ్ నాథ్ సింగ్ లాంటి వారికి ఈ మరకలు అంటుకున్నాయి. ఈ పట్టుబడ్డ నిందుతుల ఫొటోలు వైరల్ చేస్తున్న నెటిజన్లు ‘వీళ్లెవరో మీకు అస్సలు తెలీదా కిషన్ రెడ్డి గారూ..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో బీజేపీ బుక్కైపోయిందనే చెప్పాలి.