https://oktelugu.com/

Viral Video: మద్యం మత్తులో పోలీసులనే కొట్టారు.. వీడియో వైరల్

పోలీసులు తమ వాహనంలో ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మద్యం తాగిన మత్తులో ఉండటంతో ఆ యువకులు ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 4, 2024 / 10:20 AM IST

    Men attacked on Police in Mahabubabad

    Follow us on

    Viral Video: తాగిన వాడికి లోకం భిన్నంగా కనిపిస్తుందట.. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తుంటారో ఆ పోలీసులకు ఇప్పుడర్థమైంది. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad) దంతాలపల్లి మండలంలో ఆదివారం కొందరు యువకులు మద్యం తాగారు. పరిమితికి మించి తాగి, ఓ బిర్యాని(Biryani) సెంటర్ కి వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బిర్యానిలో చికెన్ ముక్కలు సరిగ్గా వేయలేదంటూ నిర్వాహకులతో గొడవపడ్డారు. అలా చినికి చినికి మొదలైన గొడవ, గాలి వానలా మారింది. అసలే ఆ బిర్యానీ సెంటర్ హైవే పక్కన ఉంటుంది. పైగా వచ్చి పోయే వాహనాలతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఇటు మద్యం తాగిన వారు, అటు హోటల్ నిర్వాహకులు పరస్పరం గొడవపడ్డారు. దీంతో కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు.

    పోలీసులు తమ వాహనంలో ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ గొడవ పడుతున్న ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మద్యం తాగిన మత్తులో ఉండటంతో ఆ యువకులు ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. చేతిలో ఉన్న కర్రలతో వారిని కొట్టారు. దీంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు కూడా తమ చేతిలో ఉన్న లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటసేపు అక్కడ ఏం జరుగుతుందో స్థానికులకు అంతుపట్టలేదు. పొరుగు పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బంది రప్పించడం.. వారు రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపులోకి వచ్చింది.


    చికెన్ ముక్కలు బిర్యానీలో తక్కువగా రావడం వల్లే మద్యం తాగిన యువకులు గొడవ పెట్టుకున్నారని తెలుస్తోంది. చికెన్ ముక్కలు ఏవని యువకులు అడగడం.. దానికి బిర్యానీ సెంటర్ నిర్వాహకులు సమాధానం చెప్పడం.. ఆ సమాధానానికి ఆ యువకులు సంతృప్తి చెందకపోవడంతోనే గొడవ ప్రారంభమైందని సమాచారం. కాగా, తమపై దాడులకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మద్యం తాగి, న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు గానూ వారిపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.