Bihar Fake Degree Scam: ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేయాలంటే అనేక రకాల ధ్రువపత్రాలు జతచేయాలి. అనేక పరిశీలనల తర్వాత ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలోను అధికారులు అనేక రకాలుగా వడపోతలు చేపడతారు. చివరికి అర్హులకు రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగం కల్పిస్తారు. ఇలా చేయలేదేమో.. ఇలా చేయాలి అనుకోలేదేమో.. మొత్తానికి దున్నపోతు పాలు పితకమని అనుకున్నారేమో.. మొత్తానికి కళ్ళు మూసుకున్నారు.. వారు కళ్ళు మూసుకుని ఉన్న ఫలితం దారుణానికి దారి తీసింది.
అది బీహార్ రాష్ట్రం.. అక్కడి ప్రభుత్వం 2006 నుంచి 2015 మధ్య జరిగిన ఉపాధ్యాయ నియామకాల వ్యవహారాన్ని తేల్చాలని విజిలెన్స్ బ్యూరోను నియమించింది. అ బ్యూరో బృందం సమగ్ర విచారణ జరిపింది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నకిలీ విద్యాసంస్థల పేరుతో డిగ్రీలు జారీ చేశారు. ఫోర్జరీ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీటన్నింటినీ కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా దర్జాగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు జీతాలు కూడా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు.
విజిలెన్స్ ఎంక్వయిరీలో ఈ విషయం తెలియడంతో పోలీసులు మరింత లోతుగా ఈ వ్యవహారం మీద దృష్టి సారించారు. అయితే నాటి ప్రభుత్వం అండదండలతోనే ఈ వ్యక్తులు చెలరేగిపోయారని తెలుస్తోంది. నకిలీ విద్యాసంస్థలు నాటి కాలంలో ఇష్టానుసారంగా ధ్రువ పత్రాలు జారీ చేశాయని.. ఫలితంగా వారంతా ఉద్యోగాలు పొందారని విజిలెన్స్ ఎంక్వయిరీలో బయటపడింది. దాదాపు 3000 మంది టీచర్లు ఇలా అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఎంక్వైరీలో తేలింది. అయితే వీరి మీద బీహార్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించిన జీతాలను వడ్డీతో సహా వారి దగ్గర నుంచి వసూలు చేయనుంది. అయితే ఈ విచారణ భయంతోనే ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే వారిని కూడా బీహార్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. వారికి చెల్లించిన జీతభత్యాలను కూడా వసూలు చేయాలని నిర్ణయించింది.
గత ప్రభుత్వాల నియామక వ్యవహారాల మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. అంతేకాదు ఈ వ్యవహారాలలో అక్రమాలకు పాల్పడిన అధికారులను గుర్తించింది. ఈ తీగ మొత్తం లాగుతున్న నేపథ్యంలో నాడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు కూడా దోషులుగా మారే అవకాశం కనిపిస్తోంది.. మరి వీరిపై బీహార్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది.. భవిష్యత్ కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి విధానాలకు రూపకల్పన చేస్తుంది.. చూడాల్సి ఉంది.
