Bihar elections: దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి దేశ రాజకీయాలలో మరింత సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆశలను సజీవంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటున్నది. అటు బిజెపి.. ఇటు కాంగ్రెస్ బీహార్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో అంట కాగుతున్నాయి.. ఒక రకంగా ఈ రెండు పార్టీలకు బీహార్లో అనుకున్న స్థాయిలో బలం లేదు.. అక్కడ ప్రాంతీయ పార్టీలకు కూడా జాతీయ పార్టీలతో పొత్తు అనేది అనివార్యం. అందువల్లే పరస్పర అవసరాల దృష్ట్యా ఎన్నికల ప్రయాణాన్ని సాగిస్తున్నాయి.
బీహార్ రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలు నవంబర్ 6న జరిగాయి. రెండో దశ నేడు జరుగుతోంది. 2020లో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ కూటమి 125 సీట్లు సాధించింది. మహాగట్ బంధన్ కూటమికి 110 సీట్లు వచ్చాయి. దీంతో నితీష్ కుమార్ ఎన్డీఏ సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. ఆ తర్వాత రెండు సంవత్సరాలకి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిని వదిలేశారు. మహా గాట్ బంధన్ కూటమిలోకి వెళ్లిపోయారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండగా లాలు కొడుకు తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రి అయ్యాడు. అయితే లాలు కుటుంబం తీవ్రస్థాయిలో మొదటి తీసుకురావడంతో మళ్లీ నితీష్ ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసాడు.
ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారానే పోటీ చేస్తున్నాడు.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలని తేజస్వి యాదవ్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బీహార్ లో ఎన్నికల ప్రచారాన్ని ముందుగానే మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికల ప్రచారంలో బీహార్ సమస్యల గురించి ప్రస్తావించకుండా.. కేవలం ఓటు చోరీ అనే అంశాన్ని మాత్రమే ఆయన బయటపెడుతున్నారు. ఎన్నికల సంఘం, కేంద్రం కలిసిపోయాయని ఆయన ప్రచారం చేశాడు.. వాస్తవానికి రాహుల్ గాంధీ చేసిన ప్రచారం తేజస్వి యాదవ్ కు ఏ మాత్రం నచ్చలేదని తెలుస్తోంది. పైగా రాహుల్ ఓటు చోరీ కార్యక్రమానికి వచ్చిన వారందరిని చూపించి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడిగిందని తేజస్వి యాదవ్ బృందం పరోక్షంగా ఆరోపించింది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడిగింది. సీట్ల పంపిణీ విషయంలో బేరం సరిగా కుదరకపోవడం తో ఎంజీబీ లో పార్టీ నేతలు 12 సీట్లలో స్నేహపూర్వక పోటీ చేస్తూ ఉండడం విశేషం.. వాస్తవానికి మహాగట్ బంధన్ లోకి ఎంఐఎం కూడా వెళ్దాం అనుకుంది. కానీ ఎంఐఎం ఉంటే హిందువుల ఓట్లు ఎన్డీఏకు వెళ్తాయనే భయంతో కూటమిలో ఓవైసీ పార్టీని చేర్చుకోలేదు.. దీంతో ఓవైసీ పార్టీ 25 స్థానాలలో పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో ఓవైసీ పార్టీ పోటీ చేసి ఐదు సీట్లు గెలుచుకుంది. ఇందులో నలుగురు ఆర్జెడిలోకి వెళ్లిపోయారు.
Also Read: ఎన్నికల వేళ బీహార్ లో ఊహించని పరిణామం!
బీహార్ రాష్ట్రంలో ఓటు చోరీ అని విస్తృతంగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ.. దానిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. ముఖ్యమైన పనులు ఉన్నట్టుగా అతడు ఏకంగా కొలంబియా పర్యటనకు వెళ్లిపోవడం విశేషం. ఆ తర్వాత సీట్ల సర్దుబాటు, ఇతర విషయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక బీహార్ లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొత్తం 15 సభలో పాల్గొన్నారు.. నరేంద్ర మోడీ 12 సభలో పాల్గొన్నారు. అమిత్ షా 34, యోగి, నడ్డా, శివరాజ్ చౌహాన్ వంటి 50 మంది బీజేపీ ప్రముఖులు హోరాహోరిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు రాహుల్ గాంధీ తన బృందంతో కలిసి మధ్యప్రదేశ్ వెళ్లిపోయారు. అక్కడి పంచమరి టైగర్ రిజర్ ఫారెస్ట్ లో సఫారీ టూర్ ఎంజాయ్ చేశారు. మళ్లీ సాయంత్రం బీహార్ వచ్చి రెండు ఎన్నికల సభల్లో పాల్గొని.. ఓటు చోరీ అంటూ మళ్ళీ విమర్శలు చేశారు. వాస్తవానికి ఎన్నికలు అనేవి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. రాజకీయ పక్షాలు ఎంతో చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. తీవ్రంగా శ్రమించాలి.
వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో బిజెపి కూటమి ప్రారంభం నుంచి చివరి వరకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తే.. రాహుల్ గాంధీ మాత్రం పార్ట్ టైం రాజకీయాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఆయన అనేక దేశీయ, విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారు. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎం, ఈసీ లను నిందిస్తూ కాలం గడుపుతున్నారని రాహుల్ గాంధీ మీద రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.. రాహుల్ గాంధీకి ఏకపక్షంగా మద్దతు పలికే సుప్రసిద్ధ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయి కూడా విమర్శిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడు అది కూడా ప్రధానమంత్రి కావాలనుకున్న వ్యక్తి ఇలా చేయకూడదని విమర్శిస్తున్నారు.