2-Day CII Partnership Summit: ఐదు సంవత్సరాలు పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడిపోయింది. పెట్టుబడుల పరంగా కూడా వెనకడుగు వేసింది. ఎన్నో విలువైన వనరులు ఉన్నప్పటికీ.. విస్తారమైన సముద్రం.. అంతకు మించిన భూములు ఉన్నప్పటికీ ఏపీలో సరైన నాయకత్వం లేకపోవడం వల్ల పారిశ్రామికంగా వెనుకడుగు వేసింది. కానీ 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గూగుల్ సంస్థ డాటా సెంటర్ ను ఏర్పాటు చేయించడానికి ఒప్పించారు. ఆ తర్వాత ఆయన యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ పర్యటనకు వెళ్లారు . అక్కడ వివిధ సంస్థలతో మాట్లాడారు.. పెట్టుబడులు పెట్టాలని కోరారు..
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా వెళ్లారు. ఆస్ట్రేలియాలో ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రవాస భారతీయులతో కూడా ముచ్చటించారు. చంద్రబాబు, నారా లోకేష్ పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తోంది.. ఎందుకంటే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే విజయవాడలో నవంబర్ 14, 15 తేదీలలో రెండు రోజులపాటు సిఐఐ ఆధ్వర్యంలో పెట్టుబడిదారుల సదస్సును ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజు ప్రారంభ ప్లీనరీ జరుగుతుంది. ఏపీలో ఉన్న పెట్టుబడి వాతావరణాన్ని, పరిశ్రమలకు అందించే సహకారాన్ని ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. రష్యా, జపాన్, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ ప్రాంతాలనుంచి వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. దశలవారీగా సెషన్లు జరుగుతూ ఉంటాయి. వ్యూహాత్మక పారిశ్రామిక, వాణిజ్య భాగస్వామ్యాల పెంపుదలను ఇందులో చర్చిస్తారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీ కండక్టర్, తీర ప్రాంత లాజిస్టిక్స్, గ్రీన్ హైడ్రోజన్, స్థిరమైన నగరాలు, పర్యాటక విస్తరణ, అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే పరికరాల తయారీ, డ్రోన్ l తయారీ, రక్షణ పరికరాల తయారీ వంటి వాటి గురించి చర్చిస్తారు.
ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణము ఉందని చెప్పే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫైనాన్స్, గ్లోబల్ స్టార్టప్, వ్యవసాయ వ్యాపారం, మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఆవిష్కరణలు.. రాష్ట్రం అమలు చేస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి రెండవ రోజు చర్చిస్తారు. స్వదేశీ క్వాంటం స్టాక్ నిర్మించడానికి.. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి కూడా చర్చిస్తారు. ఈ సదస్సు ఏపీ చరిత్రను సమూలంగా మార్చి వేస్తుందని కూటమినేతలు చెబుతున్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని.. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఏపీ బ్రాండ్ ను విస్తరించడంలో చంద్రబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దానికి నారా లోకేష్ తన వంతు పాత్రను పోషిస్తున్నారు. తద్వారా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి బహుళ జాతి సంస్థలు ముందుకు వస్తున్నాయని కూటమినేతలు అంటున్నారు.