Nitish Kumar must apologize: బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన ఆయనను అంతర్జాతీయ మీడియాలో వ్యక్తిగా చేసింది. ఆయన కేంద్రంగా మీడియా వార్తలను వండి వార్చింది.
ప్రస్తుతానికి బీహార్ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు. ఆ రాష్ట్రంలో అధికార పార్టీ కుప్పకూలడానికి దోహదం చేసే పరిస్థితులు కూడా లేవు. కానీ నితీష్ కుమార్ చేసిన ఒక చిన్న పని ఆయనను ఏకంగా ఒక వర్గానికి శత్రువులాగా మార్చింది. దీంతో ఆయన కేంద్రంగా కొద్ది రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ నుంచి కూడా నితీష్ కుమార్ కు ఒక వర్తమానం అందింది. అది కాస్త కలకలం రేపింది.
ఇటీవల నితీష్ కుమార్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు. ఆ సమయంలో ఓ మహిళ వైద్యురాలు హిజాబ్ ధరించి అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ముఖం చూసేందుకు నితీష్ కుమార్ హిజాబ్ లాగారు.. ఇది కాస్త పెను దుమారాన్ని రేపింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆందోళన మొదలు పెట్టారు. హిజాబ్ తొలగించడం సరైన విధానం కాదంటూ మండిపడ్డారు. ఇది వారి సంస్కృతి పై జరుగుతున్న దాడి అని ఆరోపించారు.
ఇది ఇలా ఉండగానే మహిళా డాక్టర్ హిజాబ్ లాగిన ఘటనపై నితీష్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని తాజాగా పాక్ గ్యాంగ్ స్టర్ షహ్జద్ భట్టి డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.. ” ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి ఒక మహిళా వైద్యురాలు హిజాబ్ ధరించి వస్తే.. బహిరంగంగా అలా లాగుతారా? ఇది ఎంతవరకు న్యాయం? ఒక మహిళకు తాను నచ్చిన దుస్తులు ధరించే అవకాశం కూడా లేదా” అంటూ భట్టి సోషల్ మీడియాలో ఆరోపించారు. మరోవైపు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని డిజిపి వినయ్ కుమార్ పేర్కొన్నారు. బెదిరింపు ఘటనపై సమాచారం అందిన నేపథ్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఈ వ్యవహారంపై తమ వద్ద పూర్తిస్థాయిలో వివరాలు లేవని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గురించి.. ఇతర విషయాల గురించి పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డిజిపి అన్నారు.