Hyderabad Land Auction: హైదరాబాద్ భూముల వేలం వెనుక అతిపెద్ద కుట్ర.. సంచలన నిజాలివీ

హైదరాబాద్ నగరానికి చెందిన జీవీ నారాయణమూర్తి అనే ఒక వ్యక్తి మే 25న మేడిపల్లిలో ప్రభుత్వ నిర్వహించిన హెచ్ఎండిఏ లే అవుట్ వేలం పాటలో పాల్గొన్నాడు. గజం 50 వేల చొప్పున పాడి ఒక ఫ్లాట్ దక్కించుకున్నాడు.

Written By: K.R, Updated On : August 14, 2023 3:08 pm

Hyderabad Land Auction

Follow us on

Hyderabad Land Auction: మొన్న కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికింది. బుద్వేల్ లోనూ ఇదే తీరుగా పలుకుతుందని ప్రభుత్వం అనుకుంటున్నది. పక్కనే ఉన్న మోకిలా లో కూడా ఇదే స్థాయిలో ధర ఉంటుందని సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ప్రచారం చేయించింది. “ఆలసించినా ఆశాభంగం” అనే రీతిలో వార్తలు కుమ్మేసింది. హైదరాబాదులో భూముల ధరలు ఆ స్థాయిలో పెరిగాయా? ఆ రేంజ్ ధరలు పెరిగితే ఎవరికి లాభం? ఈ ధరల పెరుగుదల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం రియల్ మాఫియా.

ఉదయం లేస్తే కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నాడని మోడీ మీద కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ కాడికి వీరేమో సుద్దపూసలైనట్టు.. వాస్తవానికి భూముల ధరలు కొత్తగా పరిశ్రమలు వస్తేనే, హైవే పడుతుందనే వార్తలు వస్తేనే తప్ప.. అవేవీ లేకుండానే రాత్రికి రాత్రి భూముల ధరలను రెండు రెట్లు, అంతకుమించి పెంచే మాయాజాలం ప్రస్తుతం హైదరాబాద్ రాజధాని చుట్టూ జరుగుతోంది. అదే సర్కారీ వేలం. పాలనను పక్కనపెట్టి భూముల ధరలను అడ్డగోలుగా పెంచి విక్రయిస్తోంది. లక్ష డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనడం, అడ్డగోలుగా ధర పెంచి, ఆ తర్వాత ఆ భూములు కొనకుండా వదిలేయడం.. తాము చెల్లించిన ధరావత్ సొమ్ము లక్ష పోయినప్పటికీ వేలంలో పెరిగిన రేట్ల దెబ్బకు చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువ కోట్లల్లో పెరుగుతుందని వారి వ్యూహం. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఆడుతున్న ఈ నాటకానికి సర్కార్ సహకారం ఉండడం మరింత విషాదం.

హైదరాబాద్ నగరానికి చెందిన జీవీ నారాయణమూర్తి అనే ఒక వ్యక్తి మే 25న మేడిపల్లిలో ప్రభుత్వ నిర్వహించిన హెచ్ఎండిఏ లే అవుట్ వేలం పాటలో పాల్గొన్నాడు. గజం 50 వేల చొప్పున పాడి ఒక ఫ్లాట్ దక్కించుకున్నాడు. ఆ ప్లాట్ పూర్తి ధర చెల్లించాడు. ఆ తర్వాత నారాయణమూర్తి హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్లి తన ప్లాట్ పక్కన ప్లాట్లు కొనుగోలు చేసిన వారి వివరాలు అడిగాడు. భవిష్యత్తులో తన ఇరుగు, పొరుగువారు ఎవరో తెలుసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ వివరాలు తెలుసుకొని ఆయన షాక్ కు గురయ్యారు. అంటే తనతో పాటు ఆ ప్లాట్ లను వేళలో అధిక ధరకు కొనుగోలు చేసిన వారిలో 80 మంది అసలు డబ్బు చెల్లించలేదు. వేలంపాటలో పాల్గొనేందుకు కట్టిన ధరావత్ సొమ్ము లక్షను కూడా వారు వదిలేసుకున్నారు అన్న విషయం తెలియడంతో ఆయన నివ్వెర పోయారు. ప్లాట్లను వేలంలో పాడుకున్నవారు నిర్ణీత గడువులోగా సొమ్ము పూర్తిగా చెల్లించకుంటే హెచ్ఎండిఏ డిపాజిట్ సొమ్ము లక్ష రూపాయలు తిరిగి ఇవ్వదు. నారాయణ మూర్తి లాంటి సామాన్యులు అయితే అలాంటి లక్ష రూపాయల డిపాజిట్ సొమ్మును వృధాగా వదిలేసుకునేందుకు సిద్ధపడరు. అలా వదులుకున్న వారు మొత్తం తమ ఆస్తుల విలువను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న ముఠాలోని సభ్యులే.

ప్రీ లాంచ్ లలో తమ విల్లాలు, అపార్ట్మెంట్లను అమ్ముకోవాలని అత్యాశపరులైన రియల్టర్లు హైదరాబాద్ భూముల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. ధరావత్ సొమ్ము కింద లక్ష రూపాయలు ఎరగా వేసి వేలంలో ఫ్లాట్ల ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి, తర్వాత జారుకుంటున్నారు. “పోతే లక్ష, వస్తే మన భూముల విలువ అమాంతం పెరుగుతుంది” అనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. ఇటీవల హెచ్ఎండిఏ మోకిలా ఫ్లాట్ల వేలం విషయంలోనూ ఇదే జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేయడంతో దాదాపు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంపై అప్పటినుంచి కొనుగోలు అమ్మకాల ప్రభావం పడింది. దీంతో 111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా 400 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏ అనుమతి కూడా తీసుకున్నారు. అయినా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి ఈ ఆదాయం 50 నుంచి 100% దాకా పెరిగింది. ఏడాది ఒక్క శాతం కూడా పెరగలేదు. గత ఏడాది కంటే పడిపోయింది. 2022లో ఏప్రిల్ నుంచి జూలై వరకు రిజిస్ట్రేషన్ ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆదాయం, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ లతో పోలిస్తే 2023లో అటు ఆదాయం ఇటు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు రెండూ తగ్గాయి. 2022_23 ఏడాది ఏప్రిల్, మే, జూన్,జూలై మాసాల్లో 6.99 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ నాలుగు నెలల్లో 6.56 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదే నాలుగు నెలల కాలంలో ఆదాయం కూడా 150 కోట్లకు తగ్గింది. మరోవైపు రాష్ట్ర సర్కారు ఆదాయం రాబట్టుకునేందుకు నిర్వహిస్తున్న భూములకు వేలంపాటలో కానీ విని ఎరగని రీతిలో ధరలు పలకడం ఏమిటనే సందేహం కలుగుతోంది.

ఆర్థిక మాంద్యం వల్ల కుప్పకూల బోతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వ రంగంలోకి దిగింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వేలం మాఫియాకు ప్రభుత్వ సహకారం ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే వేలంలో ప్రారంభ ధరలను సర్కారు ఆయా ప్రాంతాల్లో ఉన్న ధరలకు అనుగుణంగా, లేకుంటే ఇంకా కొంచెం ఎక్కువగానే నిర్ణయిస్తున్నదని, ఆ తర్వాత ధరలను అడ్డగోలుగా పెంచే పనిని వేలం మాఫియా పూర్తి చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.. ఉదాహరణకు మే నెల 25న మేడిపల్లి లో హెచ్ఎండిఏ 85 ప్లాట్లకు వేలం వేసి విక్రయించింది. ప్రారంభ ధర 32,000గా నిర్ణయించింది. అత్యధికంగా గజం ధర 50 వేలు పలికింది. వేలంలో ఫ్లాట్లు దక్కించుకున్న వారు ఇప్పటివరకు ధర చెల్లించలేదు. మధ్య తరగతి వారు మాత్రం గజాన్ని 30 నుంచి 50 వేల వరకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు. ఇక ఇటీవల జరిగిన మోకిలాలో కూడా ఇలాంటి తతంగం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోకాపేట, బద్వేల్ ప్రాంతాల్లో రేట్లు పెరగగానే ఇక్కడ కూడా అమాంతం పెంచారనే విమర్శలున్నాయి.