
తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమానికి ముందు ఊహించని షాక్ తగిలింది. ఈ షాక్ నుంచి ఆ పార్టీ కోలుకోవడం కష్టమే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి షాక్ ఇస్తే, ఏడాది అనంతరం ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావులు వైసీపీలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
కోస్తా జిల్లాల్లో ముఖ్యమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం నాలుగురు ఎమ్మెల్యేలు టిడిపి నుంచి గెలవగా వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడంతో టిడిపి నేతల్లో గందరగోళం మొదలయ్యింది. గతంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అధికారికంగా చేరక పోయినా వైసీపీ అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని వైసీపీ చేరడంతో గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీకి టీడీపీ తరుపున ప్రాతినిధ్యం వహించే వారే కరువయ్యారు. కృష్ణా నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాత్రం పార్టీ మారే అవకాశాలు లేవని సమాచారం.
ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా పార్టీ వారిని నిలబెట్టుకోలేక పోయింది. టీడీపీ సీనియర్ నేతగా పేరున్న కారణం బలరామకృష్ణ మూర్తి టీడీపీని వదలి రెండు నెలల కిందట వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి కుమార్ లు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బె తగిలింది. జిల్లాలో ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.
వైసీపీ అధికారం చేపట్టిన అనంతరం తొలి శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, తనకు నిబద్ధత ఉంది గనుక రాజీనామా చేసి రావాలని సూచించానని వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. అందుకే టిటీడీపీకి దేవుడు 23 సీట్లే ఇచ్చాడని సభలో జరిగిన చర్చలో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సీఎం చెప్పిన విధంగానే ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఒక్కొక్కరిగా క్యూ కట్టారు.