MP Raghurama: ప్రభుత్వానికి వందల కోట్లు ఎగవేసిన బడాబాబుల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఒకరు. ఆయన ఏకంగా రూ. 947.71 కోట్లు ఎగవేసి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో సీబీఐ ఆయనపై చార్జీషీటు నమోదు చేసింది. ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న రఘురామ సహా డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లతో కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జీషీటు దాఖలు చేసింది. దీంతో రఘురామ బాగోతంపై చాలా రోజులుగా కేసు విచారణలో ఇప్పటికి చార్జీషీటు దాఖలు చేసే అవకాశం ఏర్పడింది.

తమిళనాడులోని ట్యూటీకొరిన్ లో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి భారీ మొత్తంలో రుణం తీసుకున్నారు. దీనిపై 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. 2018 అక్టోబర్ 3న హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ దాని డైరెక్టర్లపై కేసు నమోదైంది. రుణ ఒప్పంద నిబంధనలు పాటించలేదు. తీసుకున్న రుణంతో సంస్థను ప్రారంభించలేదు. కానీ రుణం మొత్తం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: అమూల్ కథ: ఏపీలో ఇన్ ఫుట్.. తెలంగాణలో అవుట్ ఫుట్..
ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్, ఎండీగా రఘురామ కృష్ణంరాజు బ్యాంకులను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశాయి. కానీ ఆయన పట్టించుకోలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్లుగా చూపించి వాటిపై కూడా రుణం తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లింపులు లేవు. దీంతో వాటిని తీసుకున్న రుణం కింద జమ చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు రఘురామపై ఏ మేరకు చర్యలు తీసుకోనున్నారో తెలియడం లేదు.
బ్యాంకుల నుంచి అంత పెద్ద మొత్తంలో రుణంగా తీసుకుని పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా తిరిగి రుణం చెల్లించేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో రఘురామపై చార్జీషీటు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. రఘురామ తీసుకున్న రుణాన్ని బ్యాంకులు ఎలా రాబట్టుకుంటాయో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: హిందుత్వమా? కులమా? పవన్ కళ్యాణ్ తో ఏపీ బీజేపీ దారెటు?