Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ ఇంకా రేగుతూనే ఉంది. దీంతో ఉద్యోగులు సమ్మె చేయాలనే ప్రయత్నాన్ని విరమించినా ఉపాధ్యాయులు మాత్రం వీడటం లేదు. తమకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా అంతగా పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులనే బాధ్యులను చేస్తూ సమ్మెకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.దీంతో పీఆర్సీ సాధన సమితి నాయకులతో ఉపాధ్యాయ సంఘాల నేతలు విభేదిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. పీఆర్సీ విషయంలో అందరి ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగ సంఘాల నేతలతో ఉపాధ్యాయులు గొడవలకు దిగుతున్నారు. ప్రభుత్వంతో లాలూచీపడి స్వార్థ ప్రయోజనాల కోసం సభ్యుల ఆత్మాభిమానాన్ని అంగట్లో అమ్ముకోవడం సముచితం కాదని చెబుతున్నారు.
ఈ క్రమంలో ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. సమ్మె చేయాలా వద్దా అనేది ఆనాటి సమావేశంలో నిర్ణయించబడుతుందని తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఏం జరుగుతుందోననే అనుమానాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు మాత్రం ససేమిరా అంటున్నారు. సమ్మె చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
Also Read: Andhra Pradesh Government: ప్రభుత్వ భూముల తాకట్టు.. అప్పులు రాబట్టు
ఉపాధ్యాయులకు ఏం తక్కువైందని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటూ హెచ్ఆర్ఏ తగ్గిందని బాధ పడటంలో అర్థం లేదని వాదిస్తోంది. దీనిపై ఉపాధ్యాయులు మరోసారి ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. అసలు అద్దె ఇళ్లలో ఉండకుండా హెచ్ఆర్ఏ ఎలా పెంచమంటారని అడుగుతోంది. పైగా తెలంగాణ కంటే ఒక్క శాతం మాత్రమే తక్కువ ఫిట్ మెంట్ ఇస్తుంటే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రభుత్వం అడగడంతో ఉపాధ్యాయులు ఏం చెప్పలేకపోతున్నారు.
ఎవరో చెప్పిన దాన్ని వింటూ ఉపాధ్యాయులు అనవసరంగా ప్రభుత్వంతో గొడవకు దిగడం బాగాలేదు.ఇప్పటికైనా సరిగా ఆలోచించి విద్యార్థుల భవిష్యత్ కోసం సమ్మె బాట విరమించి విధుల్లో చేరి ప్రభుత్వంతో సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. పీఆర్సీ కమిటీకి ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. తామే ప్రత్యేకంగా ఉద్యమంలో దిగేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై పోరుకు సై అంటున్నారు.దీంతో ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: Andhra Pradesh: ఉద్యోగులకు బాసటగా బాబుః జగన్ కు తలనొప్పేనా?