Chandrababu: చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట దక్కడం లేదు. కనీస ఉపశమనం లభించడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గత 32 రోజులుగా చంద్రబాబు ఉన్నారు. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. పూర్తిగా కేసుల నుంచి బయటపడేందుకు క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రేపు అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇంతలో హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 17 కు వాయిదా పడింది.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బుధవారం పిటీషన్ దాఖలు చేశారు. ప్రధాన పిటిషన్ పై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22న నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి అక్రమంగా అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే తనను పోలీస్ కస్టడీలోకి తీసుకొని సిఐడి రెండు రోజులు పాటు విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని చంద్రబాబు న్యాయవాదులు చెప్పుకొచ్చారు.
తమ అభ్యర్థన సైతం పరిగణలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టి వేసిందని వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో సాక్షాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందని చెప్పుకొచ్చారు. తాను ప్రజా జీవితంలో ఉన్నానని.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని.. దర్యాప్తునకు సహకరిస్తానని.. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని చంద్రబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందించారు. చంద్రబాబు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించారు. విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. మొత్తానికైతే హైకోర్టులో సైతం చంద్రబాబుకు ఉపశమనం దక్కలేదు.