Homeజాతీయ వార్తలుMaharashtra Political Crisis: ‘మహా’ఫైట్‌ : శివసేన గెలిచింది.. బీజేపీ ఓడింది..

Maharashtra Political Crisis: ‘మహా’ఫైట్‌ : శివసేన గెలిచింది.. బీజేపీ ఓడింది..

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని, అయితే ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఉద్ధవ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఊటర మాత్రం లభించలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని స్పష్టం చేసింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది.

మహా సంక్షోభంపై సుప్రీంలో విచారణ..
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్‌షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సంక్షోభ సమయంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ‘ఉద్ధవ్‌ ఠాక్రే మెజార్టీ కోల్పోయారని నిర్ధారణకు వచ్చేందుకు గవర్నర్‌ వద్ద తగిన సమాచారం లేనప్పుడు.. సభలో మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని పిలవడం సబబు కాదు. గవర్నర్‌ విచక్షణాధికారాలను అమలు చేసిన తీరు చట్టపరంగా లేదు. అలాగే పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి బలపరీక్షను ఒక మాధ్యమంగా వాడలేం. అయితే, ఉద్ధవ్‌ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేడయంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఠాక్రే రాజీనామా చేయడంతో.. అప్పటికే అతిపెద్ద పార్టీ అయిన భాజపా మద్దతున్న ఏక్‌నాథ్‌షిండే వర్గంతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించడం సమర్థనీయమే ’అని వెల్లడించింది.

అనర్హత తేల్చడంపై..
శిండే, ఆయన వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నాటి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ నిర్ణయాన్ని వాదనల్లో భాగంగా ఉద్ధవ్‌ వర్గం ప్రశ్నించింది. ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తాము అనర్హత వేటు వేయలేమని సుప్రీం వెల్లడించింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు.. రెబల్‌ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా లేదా అన్న అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది.

స్వాగతిస్తున్న ఇరు పక్షాలు..
సుప్రీం తీర్పును ఉద్ధవ్, షిండే వర్గాలు స్వాగతిస్తున్నాయి. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఏక్‌నాథ్‌ షిండే ధికారంలోకి వచ్చారు. ఆయన కూడా రాజీనామా చేయాలి’అని ఉద్ధవ్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు నిర్ణయం చెబుతోందని ఉద్ధవ్‌ వర్గం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఇక సుప్రీం తీర్పును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ స్వాగతించారు. మహారాష్ట్ర విప్‌ నియామకాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular