Chandrababu: అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో ఎన్నికల ముందు చంద్రబాబుకు స్వేచ్ఛ లభించినట్లు అయ్యింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 52 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆయనకు ఎక్కడా ఊరట దక్కలేదు. అటు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉంది. ఇరువర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ తరుణంలో చంద్రబాబుపై మోపబడిన ఇతర నేరారోపణలకు సంబంధించి కేసులు సైతం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నాయి.
తాజాగా మూడు కేసుల్లో ఒకేసారి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటు మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తో పాటు విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కూ ముందస్తు బెయిల్ మంజూరు కావడం విశేషం.