https://oktelugu.com/

Ongole: ఒంగోలులో బిగ్ ఫైట్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో.. నాలుగు సార్లు టిడిపి, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా.. గత రెండు ఎన్నికల్లో వైసిపి గెలుపు పొందుతూ వస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 19, 2024 / 02:23 PM IST

    Big political fight in Ongole

    Follow us on

    Ongole: రాష్ట్రంలో కీలక నియోజకవర్గాల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన విజయం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు బిగించింది. ఆపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలితో వైసిపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీ, బాలినేనికి సన్నిహితుడు అయినా మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఖరారు అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఒంగోలు అసెంబ్లీ స్థానంలో సైతం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఈ జిల్లాలో నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలను గెలుపొందాలన్న కృతనిశ్చయంతో ఉంది. జనసేన, బిజెపితో పొత్తులో భాగంగా స్వీప్ ఖాయమని బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీ సీటును దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో.. నాలుగు సార్లు టిడిపి, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగా.. గత రెండు ఎన్నికల్లో వైసిపి గెలుపు పొందుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టిడిపి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు ఖరారు అయ్యారు. దీంతో హోరాహోరి పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఒంగోలు లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ సీటు జనరల్ కు కేటాయించారు. దీని పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల 30 వేల మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ,కాపు, రెడ్డి సామాజిక వర్గం వారిదే ఆధిపత్యం. యాదవులు, వైశ్యులు కూడా ఉన్నారు.

    ఒంగోలు అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ టిడిపి ఆవిర్భావంతో సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టిడిపి నిలిచింది. టిడిపి ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు మాత్రమే విజయం సాధించింది. టిడిపి సైతం నాలుగు సార్లు విజేతగా నిలిచింది. కాంగ్రెస్ తో పాటు వైసీపీలో బాలినేని హవా నడిచింది. తొలిసారిగా 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. 2014లో మాత్రం టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో అదే దామచర్ల జనార్ధన రావు పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా వారిద్దరే పోటీ చేస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.

    అయితే బాలినేని వ్యవహార శైలి ఇటీవల వైసిపి నేతలకే మింగుడు పడలేదు. మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయేసరికి బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చాలాసార్లు పార్టీ వీడుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీలో కొనసాగాల్సి వచ్చింది. అటు బలమైన నేత కావడంతో వైసీపీ సైతం టిక్కెట్ కేటాయించాల్సి వచ్చింది. సన్నిహితుడు అయిన ఎంపీ మాగుంట టిడిపిలోకి వెళ్లడం, వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి తో విభేదాలు కొనసాగుతుండడంతో.. గెలుపు పై బాలినేని అప నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ తాను ఓడిపోయినా.. పార్టీ అధికారంలోకి రాకపోయినా.. బాలినేని తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో.. ఒంగోలు రాజకీయం ఎటు తిరుగుతుందో చూడాలి.