Y. S. Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తూ వస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఉంటుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే రెండు రోజులుగా ఈ కేసులో జరుగుతున్న మార్పులను చూస్తే ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ కొద్ది రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదిగో అరెస్ట్ అవుతున్నారు అంటూ.. అదిగో అరెస్టు చేయబోతున్నారంటూ మీడియా ఊదరగొట్టింది. అయితే, అవినాష్ రెడ్డి అరెస్టు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. అసలు ఈ కేసు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అరెస్టు ఉంటుందా..? లేదా..? అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు..? చేయకపోవచ్చు అన్న స్థితికి కేసు చేరిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసులో తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోడీ దగ్గరకు వెళుతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అది కూడా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు.
అరెస్ట్ చేసే అవకాశం ఉన్న చేయని సిబిఐ అధికారులు..
అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ 25న బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అయితే, సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అంటూ ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 24 తో ముగిశాయి. ఈ నెల 25న అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు చేయలేదు. సిబిఐ అధికారులు అరెస్టు చేయాలనుకుంటే ఇప్పటికే చేసి ఉండే వారని, బలమైన కారణం వల్లే అవినాష్ రెడ్డి అరెస్టు జరగడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏదో జరుగుతుందన్న అనుమానాలకు ఇదే కారణం అవుతుంది. మొన్నటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ఇస్తామంటూ బలంగా చెప్పిన సిబిఐ అధికారులు అందుకు అనుగుణంగా ముందుకు కదలకపోవడం పట్ల అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి.
బెయిల్ పై నేడు తేలనున్న వ్యవహారం..
ఇకపోతే అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే విచారణ జరిగింది. అయితే తెలంగాణ హై కోర్టులో జరగనున్న విచారణకు సంబంధించి తాము ఇచ్చిన తీర్పు ప్రభావం చూపదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో జరగనున్న విచారణ అత్యంత కీలకంగా మారనుంది. కడపలో మంగళవారం పర్యటించిన అవినాష్ రెడ్డి హత్యకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పది నిమిషాల ముందు తనకు ఫోన్ రాకపోయి ఉంటే ఈ కేసులో తనకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడు దయ, న్యాయం మీద నమ్మకంతో ముందుకు వెళుతున్నామని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకింత నిరుత్సాహంతో చేసిన ఈ వ్యాఖ్యలు.. అవినాష్ రెడ్డి అరెస్టును సూచిస్తున్నాయంటూ పలువురు పేర్కొంటున్నారు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం అయిన బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారం జరగనుంది. విచారణ కొద్దిగా ఏం జరగబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.