ఇటీవల అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో 20 సంవత్సరాలుగా ఉంటున్న అమెరికన్ బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు కొత్త అధ్యక్షుడు. ఈ నిర్ణయం ప్రకారం.. త్వరలో అమెరికన్, నాటో సైన్యం వెనక్కు వెళ్లిపోనుంది. అయితే.. ఈ ప్రభావం భారత్ పై ఎక్కువగా పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం పైనే దాడి జరగడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. దీంతో.. అమెరికా ఉగ్రవాద నిర్మూలనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓ వైపు ఉగ్రవాదులను ఏరివేసేందుకు.. మరోవైపు ప్రపంచం ముందు తన బలం చేజారలేదని నిరూపించుకునేందుకు సిద్ధపడింది. ఇందులో భాగంగానే.. అల్ ఖైదాకు ప్రధాన స్థావరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు బలగాలను తరలించింది.
ఇప్పటికి రెండు దశాబ్దాలు గడిచాయి. మరి, ఉగ్రవాద నిర్మూలన ఎంత వరకు జరిగిందని అంటే.. అంతంత మాత్రమేనని చెప్పాలి. కానీ.. ఈ కాలంలో అమెరికాకు చాలా నష్టం జరిగింది. ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా ఖర్చయ్యిందని అంచనా. అంతేకాదు.. వేలాది మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఈ అంశంపై దృష్టిసారించారు. ఇంతా చేసి.. ఏం సాధించాం అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించలేదు కాబోలు.. అందుకే బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.
గతేడాది ఫిబ్రవరిలోనే అమెరికా-తాలిబన్ల మధ్య ఈమేరకు ఒప్పందం కుదిరింది. త్వరలో దాన్ని అమలు చేయాలని బైడెన్ ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇదే జరిగితే భారత్ ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఆఫ్ఘనిస్తాన్ భారత్ సరిహద్దు దేశం. పాకిస్థాన్ తో శతృత్వం కొనసాగుతుండడంతో.. ఆఫ్ఘనిస్తాన్ తో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తోంది ఇండియా. ఆ దేశంలో పార్లమెంట్ నిర్మించడం నుంచి.. ఎన్నో విధాలుగా సహకారం అందిస్తోంది.
కానీ.. పాకిస్తాన్ మాత్రం ఈ దోస్తానాను విడదేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. చేస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ఉగ్రవాదులకు.. భారత్ వ్యతిరేకతను నూరిపోస్తోంది. తమదేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాక్.. తాలిబన్లను సైతం భారత్ పై ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో పలుమార్లు ఉగ్రదాడులు కూడా జరిగాయి. ఇప్పుడు అమెరికన్ సైన్యాలు వెళ్లిపోతే.. ఇక తాలిబన్లకు అడ్డూఅదుపూ లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అఫ్ఘనిస్తాన్ల జీవితాలు మళ్లీ ప్రభావితం కావడంతోపాటు.. భారత్ పైనా ఉగ్రదాలు జరిపేదిశగా ఆలోచనలు చేస్తారేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తుందని అంటున్నారు.