Bhitty Mohanty : 2006లో రాజస్థాన్ లోని అల్వార్ లో జర్మనీ కి చెందిన యువతిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన భిట్టీ హోత్రా మొహంతి సోమవారం (ఆగస్ట్ 12) భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో మరణించాడు. ఒడిశా మాజీ డీజీ ( హోంగార్డ్స్) బిద్యా భూషణ్ మొహంతి కుమారుడైన ఈ భిట్టి మొహంతి (41) క్యాన్సర్ తో చికిత్స పొందుతున్నాడు. రేప్ కేసులో దోషిగా ఉన్న భిట్టికి 2017 మార్చి 31న సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఏడాది జూన్ 5న ఆయన లొంగిపోవాలని పోలీసులు కోరారు. రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం మహిళలకు వ్యతిరేకంగా నేరాలు చేసిన కేసుల్లో నిందితులకు శిక్ష వేయించాలని ఉంది. అయితే గతేడాది అక్టోబర్ 3న ఆయనకు క్యాన్సర్ ఉన్నట్ల నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కీమోథెరపీ చేయించుకుంటున్నారు. కానీ ఈ ఆదివారం అర్ధరాత్రి భిట్టీ మృతి చెందినట్లు భువనేశ్వర్ ఎయిమ్స్ సూపరింటెండెంట్ దిలీప్ పరీడా తెలిపారు. అయితే గతంలో భిట్టీ తల్లిదండ్రులు ఆయన చికిత్స కోసం బెయిల్ కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. భిట్టీ క్యాన్సర్ తో పోరాడుతున్నాడని, ఆయన చికిత్స తీసుకునేందుకు ఈ ఉపశమనం కలిగించాలని అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను తొలుత సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే చికిత్సను అందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో భిట్టీకి తొలుత కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో కిమోథెరపీ చికిత్స అందించారు. ఆ తర్వాత భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు తరలించారు. భిట్టికి 25 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయనకు ఏడేండ్ల జైలు శిక్షను అల్వార్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఖరారు చేసింది. కేవలం 21 రోజుల్లోనే విచారణ జరిపి ఈ శిక్షను విధించింది.
ఇక రాజస్థాన్ హైకోర్టు కూడా కింది కోర్టు ఖరారు చేసిన శిక్షను తగ్గించేందుకు అనుమతించలేదు. 2006, నవంబర్ లో భిట్టి 14 రోజుల పెరోల్ పొందాడు. ఆ తర్వాత ఆయన పరారయ్యాడు. 2013 మార్చిలో భిట్టిని పోలీసులు కేరళలోని కన్నూర్ లో తిరిగి అరెస్ట్ చేశారు. రాఘవ రాజన్ గా పేరు మార్చుకొని అక్కడ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఆ రాష్ర్టంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్కడ బ్యాంకులో ఉద్యోగం పొందాడు. ఇక తిరిగి భిట్టి మరో మూడు నెలల అదనపు శిక్షను కోర్టు ఖరారు చేసింది.
ఇక మేలో ఆయన మరో పిటిషన్ వేశారు. తనను త్వరగా రిలీజ్ చేయాలని కటక్ లోని చౌదర్ కోర్టులో వేసిన పిటిషన్ ను ఆ న్యాయస్థానం తిరస్కరించింది. ఇక భిట్టి కోర్టు ఆర్డర్ తో లొంగిపోయాడు. కానీ అప్పటికే క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. కిమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండాపోయింది.
భిట్టి మొహంతి సోమవారం భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో మరణించాడు. ఏదేమైనా భిట్టి మొహంతీ జీవితం ఒక సినిమా ట్రాజెడీలా సాగింది. ఆయన రేప్ కేసులో అరెస్ట్ అవడం, బెయిల్ పొంది పరార్ అవడం, రహస్యంగా వేషంగా మార్చి ఉద్యోగం పొందడం, తిరిగి అరెస్టవడం, చివరకు క్యాన్సర్ తో పోరాడుతూ మృతి చెందడం చూస్తుంటే ఒక థ్రిల్లర్ లా సాగింది.