https://oktelugu.com/

టీ-కాంగ్రెస్ లో భస్మాసుర హస్తాలు..!

“నాయక్” అని వీవీ వినాయక్ తీసిన సినిమా ఉంది. అందులో పోసాని డైలాగ్.. “మనం నాశనమైనా పర్వాలేదు.. పక్కోడు బాగుపడకూడదు. ఇదేరా మన సైకాలజీ”. ఈ డైలాగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అతికినట్టు సరిపోయేలా ఉంది. ఇంతేకాదు.. ఈ విషయంలో ఇంకో ఇరవైరెండు ఆకులు ఎక్కువే చదివిన హస్తం నేతలు.. తమ చేతులను భస్మాసుర హస్తాల్లా మార్చుకొని, తమ నెత్తినే పెట్టుకొని కాంగ్రెస్ ను బూడిద చేసేవరకూ వదిలేట్టు లేరు. Also Read: ఢిల్లీ పొగలు.. బల్దియా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 13, 2020 / 03:24 PM IST
    Follow us on


    “నాయక్” అని వీవీ వినాయక్ తీసిన సినిమా ఉంది. అందులో పోసాని డైలాగ్.. “మనం నాశనమైనా పర్వాలేదు.. పక్కోడు బాగుపడకూడదు. ఇదేరా మన సైకాలజీ”. ఈ డైలాగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అతికినట్టు సరిపోయేలా ఉంది. ఇంతేకాదు.. ఈ విషయంలో ఇంకో ఇరవైరెండు ఆకులు ఎక్కువే చదివిన హస్తం నేతలు.. తమ చేతులను భస్మాసుర హస్తాల్లా మార్చుకొని, తమ నెత్తినే పెట్టుకొని కాంగ్రెస్ ను బూడిద చేసేవరకూ వదిలేట్టు లేరు.

    Also Read: ఢిల్లీ పొగలు.. బల్దియా సిగలో కమలం?

    ఎక్కడి నుంచి ఎక్కడి దాక..?
    తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల పోరాట ఫలితమే. కానీ.. పొలిటికల్ బ్యాలెన్స్ పూర్తి చేసింది కాంగ్రెస్సే. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలితే తెలంగాణలో ఫలితం వేరేలా ఉండేది. విపక్షంలో ఉండి చేసిన పోరాటాలు శూన్యం. 2019 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టి సాధించింది ఏమీ లేదు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఏంటో అందరికీ తెలిసింది. కేవలం ఆరున్నరేళ్లలో.. పార్టీ ఏ రేంజ్ కు దిగజారిందో అర్థమవుతోంది. పేరుకు గంపెడు మంది సీనియర్లు ఉన్నారు. అయినా ఏం లాభం..? ఇంత జరుగుతున్నా.. వాళ్లలో వాళ్ళు కీచులాడుకోవడం తప్ప, పార్టీ పుట్టి మునిగే వరకు పట్టించుకోలేదు.

    ఇప్పుడు పీసీసీ కొట్లాట..
    ఓవైపు టీఆర్ఎస్ కోలుకునే అవ్వకాశం ఇవ్వట్లేదు.. మరోవైపు బీజేపీ వేగంగా బలపడే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెట్టు పంచాయితీలు పక్కనపెట్టి అధిష్టానం చెప్పినట్టు వింటూ ఒక్కటవ్వాల్సిన హస్తం లీడర్లు.. ఆ రొచ్చులోంచి బయటకు రాలేకపోతున్నారని సొంతక్యాడరే దుమ్మెత్తి పోస్తోంది. అయినా కూడా కీచులాడుకోవడం మానట్లేదు నేతలు. కొత్త పీసీసీ చీఫ్‌ పదవి మాకంటే మాకు కావాలంటూ.. కొట్లాడుకుంటున్నారు.

    ఇంచార్జ్ దగ్గర సిల్లీ గొడవ..
    కొత్త పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి ఎంపికపై మూడురోజులపాటు అభిప్రాయాలు సేకరించిన పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిగం ఠాగూర్ ఢిల్లీకి వెళ్తున్నారు. వెళ్లే ముందు కూడా.. సీనియర్లు రచ్చ చేశారు. పీసీసీ పీఠం ఎవరికి ఇవ్వాలని పార్టీ నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో.. ఎక్కువ మంది రేవంత్ రెడ్డి వైపే వేలు చూపించారని సమాచారం. ఈ విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. దీంతో.. పలువురు సీనియర్లు హుటాహుటిన ఠాగూర్ వద్దకెళ్లి, ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా పోస్టుంగులను ఠాగూర్ ఎలా అడ్డుకుంటారు?? అన్నది వారికే తెలియాలి.

    Also Read: బీజేపీకి బంపరాఫర్ ఇస్తున్న కేసీఆర్.. వ్యూహంలో భాగమేనా?

    అధిష్టానం నిర్ణయం అయిపోయిందట..!
    వాస్తవానికి పీసీసీ పోస్టు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని హైకమాండ్ ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. అయితే.. నేతలతో సంప్రదింపులు జరిపి.. అందరి ఆమోదంతోనే ప్రకటించామని చెప్పేందుకే ఈ కసరత్తు జరుగుతోందని గాంధీభవన్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అయితే.. తమను కాదని బయటి నుంచి వచ్చిన రేవంత్ కు పదవి ఇస్తే.. తమ సపోర్ట్ లేదని చెప్పేందుకు సీనియర్లు ఈ హడావిడి చేశారన్నది టాక్.

    మునిగేదాక వదిలేట్టు లేరు..
    ప్రస్తుతం రాష్ట్రంలో టీ-కాంగ్రెస్ అంపశయ్యపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఏకమై జవసత్వాలు అందించాల్సి ఉంది. కానీ.. ఈ నేతల తీరు చూస్తుంటే.. పార్టీకి జీవి గంజి అందిచడానికి బదులు.. తులసినీళ్లు పోయడానికే సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్