https://oktelugu.com/

Bharath Bandh : భారత్ బంద్.. పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. ఎక్కడ ఎలా ఉందంటే?

దేశ వ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతమైంది. పలు రాష్ర్టాలపై బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. స్కూల్స్, కాలేజీలు సైతం మూసివేశారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ బంద్ లో పాల్గొన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2024 / 01:05 PM IST

    Bharath Bandh

    Follow us on

    Bharath Bandh : అణగారిన వర్గాలకు బలమైన ప్రాతినిథ్యం కల్పించాలనే డిమాండ్ తో దళిత, గిరిజన సంఘాలు బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ట్రైబల్ ఆర్గనైజేషన్స్ తన డిమాండ్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్రిమిలేయర్, సబ్ కేటగిరీలు చేయాలనే సుప్రీంకోర్టు ఉత్తర్వులపై దళిత, గిరిజన సంఘాలు మండిపడ్డాయి. బుధవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ బంద్ కు పెద్ద ఎత్తున సంఘాలు మద్దతు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ కులాలు, తెగలు అన్నీ సమానం కాదని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. వీటిలో చాలా కులాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. ఉదాహరణగా పలు వర్గాలను ప్రస్తావించింది. ఎస్సీ వర్గానికి చెందిన రెండు కులాలు మిగతా వారికంటే తీవ్రస్థాయిలో వెనుకబడి ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే సుప్రీం నిర్ణయం సమ్మతం కాదంటూ పలు దళిత, గిరిజన సంఘాలు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

    రాజస్థాన్ లో తీవ్ర ప్రభావం..
    భారత్ బంద్ ప్రభావం రాజస్థాన్ పై కనిపిస్తున్నది. దళిత, గిరిజన సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జోధ్ పూర్ లో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జోధ్ పూర్ డీసీపీ అలోక్ శ్రీవాస్తవ స్పందిస్తూ బంద్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు యూపీలోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపునకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో అన్ని రాష్ర్టాల్లో అదనపు బలగాలను మోహరించారు. రాజస్థాన్ డీజీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో సహకరించాలని బంద్ కు పిలుపునిచ్చిన సంఘాలను కోరినట్లు చెప్పారు.

    అసలేం జరిగిందంటే..
    ఎస్సీ, ఎస్టీ లను సబ్ కేటగిరీలుగా విభజించడానికి రాష్ర్టాలకు అధికారం ఇస్తూ ఆగస్టు 1 సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అవసరమైన వారికి రిజర్వేషన్ల ప్రాధాన్యత ఇవ్వాలి అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. కాగా, ఈ తీర్పును పలు సంఘాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇక బంద్ నేపథ్యంలోఅన్ని చోట్ల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.

    పలు రాష్ర్టాల్లో రైల్ రోకో నిర్వహించగా, రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్ కు భీమ్ ఆర్మీతో పాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మద్దతు తెలిపారు. పలు ప్రాంతాల్లో దళిత, గిరిజన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వాలు తమ ఆందోళనలను అడ్డుకోవాలని చూడడం సరికాదని మండిపడ్డారు.

    ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ బంద్ కొనసాగుతున్నది. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ బంద్ కు తెలుగు రాష్ర్టాల్లోని వివిధ సంఘాలు పాల్గొన్నాయి. వ్యాపార, వాణిజ్య సంఘాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బస్సులు కూడా తిరగడం లేదు. ఆర్టీసీ బస్సులను పలువురు నేతలు అడ్డుకోవడం కనిపించింది. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అదనపు బలగాలను పోలీస్ శాఖ సిద్ధం చేసింది.