
ఈ దేశంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. అంతిమంగా వెళ్లేది న్యాయస్థానాల వద్దకే. ఇక, కింది కోర్టుల్లో న్యాయం జరగలేదని భావిస్తే.. చివరగా తొక్కేది సుప్రీం గడపనే. అయితే.. ఆ రాష్ట్రానికి చెందిన కేసులు తాము విచారించలేమని సుప్రీం కోర్టు జడ్జీలు తప్పుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పశ్చిమ బెంగాల్లో నారదా కుంభకోణానికి సంబంధించి సీఎం మమతా బెనర్జీ వేసిన పిటిషన్లు సుప్రీం కోర్టున్యాయమూర్తి జస్టిస్ అనిరుద్దా బోస్ వద్దకు వెళ్లాయి. అయితే.. ఈ కేసును విచారించాలని అనుకోవడం లేదని ఆయన ప్రకటించారు. ఆయన బెంగాల్ కు చెందిన వారే కావడం గమనార్హం. దీంతో.. వేరే ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన పరిస్థితి.
అయితే.. మరో కేసు విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవల హింస చెలరేగిన సంగతి తెలిసిందే. బీజేపీ శ్రేణులు లక్ష్యంగా మమతాబెనర్జీ ప్రభుత్వం ఈ దాడులకు పాల్పడిందంటూ ఫిర్యాదులు వచ్చాయి.
ఈ కేసు జస్టిస్ ఇందిరా బెనర్జీ వద్దకు వెళ్లింది. అయితే.. ఈ కేసు విచారణ నుంచి ఇందిరా బెనర్జీ కూడా తప్పుకున్నారు. ఈమె కూడా కోల్ కతాకు చెందినవారే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంత రాష్ట్రానికి చెందిన కేసుల విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోవడంపై దేశ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విధంగా గతంలో ఎప్పుడూ జరగలేదని అంటున్నారు.