Pawan Kalyan Volunteers: ఏపీలోని వలంటీర్లను పవన్ కల్యాణ్ విమర్శించారన్నది ప్రస్తుతం జరుగుతున్న వివాదాంశం. అధికారంలోని వైసీపీ తన స్వలాభం కోసం ఎదుటి వారిపై ఎంతలా దుమ్మెత్తిపోసి ప్రయోజనం పొందాలనుకుంటుందో ఈ ఒక్క ఘటన నిరూపిస్తున్నది. ఆయన అన్న మాటలను పూర్తిగా వక్రీకరిస్తూ, అన్న దానిలో తప్పులుంటే సరిచేసుకోవాల్సిందిపోయి దిగజారిపోయి ప్రవర్తిస్తుంది. పూలవనంలో గంజాయి మొక్కల్లాంటి వలంటీర్ల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆయన సరిదిద్దుకున్నా, అధికార వైసీపీ కుటిల సోషల్ మీడియా వదిలేలాదు.
ఇదిలా ఉంటే, వైసీపీ ఆకృత్యాలకు పవన్ బలైన ప్రతీసారి ప్రతిపక్ష టీడీపీ, కేంద్రంలోని బీజేపీ స్పందించేంది. గతంలో జరిగిన విశాఖ, కుప్పం ఘటనల్లో పవన్, చంద్రబాబు ఒకరినొకరు పరామర్శించుకున్నారు. విశాఖలో అయితే ఏకంగా చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించి పూర్తి స్థాయి మద్దతు పలికారు. ఆ తరువాత హైదరాబాదులో రెండుసార్లు భేటీ అయ్యారు. వైసీపీ అరాచకాలపై, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇరువురు కలిసి కట్టుబడి ఉన్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. పొత్తుల విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ బాధితులుగా మారిన ప్రతీసారి ఏక స్వరంతో స్పందించారు.
అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించిన వైసీపీ సోషల్ మీడియా అదేదో ఘోరాతిఘోరమైన అంశంగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ వ్యూహాత్మక మౌనం ప్రదరిస్తోంది. కేంద్రంలోని బీజేపీ కూడా ప్రేక్షక పాత్ర పోషించడంపై జనసైనికులు మండిపడుతున్నారు. కేంద్ర రిపోర్టు మేరకే తాను స్పందించానని పవన్ అన్నారు. ఆయన దగ్గర పూర్తి స్థాయి అధారాలతోనే మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, వలంటీర్లుగా చలామణి అవుతున్న వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం ఆయా ప్రాంతాల్లో వివాదాంశంగా మారిన విషయం గమనించకపోతే ఎలా అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 50 కుటుంబాలను కేటాయించింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ఇంటింటికి తిప్పుతోంది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలను సేకరిస్తోందని పవన్ ప్రధాన ఆరోపణ. అందులో ఎంతోకొంత సత్యం ఉన్నది. వలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైన మొదట్లో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కొన్నిచోట్ల విమర్శలు చేశారు. తమకు ఎటువంటి పనిలేకుండా పోతుందని మదనపడిపోయారు.
వలంటీర్లుగా నియమితులైన వారందరూ వైసీపీ అనుకూలంగా ఉన్నవారే. అందరూ దుర్మార్గులని పవన్ చెప్పలేదు. వీరిలో కొందరు అక్రమ మద్యం అమ్ముతూ, తీసుకువస్తూ పట్టుబడినవారున్నారు. మహిళలపై వేధింపులకు దిగినవారున్నారు. గంజాయి, ఎర్ర చందనం, అత్యాచారాలు, గొడవలు, వేధింపులకు పాల్పడిన వారెందరో ఉన్నారు. ఈ ఘటనలన్నీ ఆయా ప్రాంతాల్లో పత్రికల్లో వచ్చినవే. ఇటువంటి వారి వల్ల మొత్తం వలంటీర్లకు చెడ్డపేరు వస్తుందని జనసేన అధినాయకుడు అంటున్నది. ఈ లోపాలను సరిచేసుకోకుండా వైసీపీ ప్రభుత్వం తన సొంత అజెండాతో పవన్ కల్యాణ్ ను అప్రతిష్టపాలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే, దీనిపై టీడీపీ, బీజేపీ వైఖరి ఎంటన్నది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది.