https://oktelugu.com/

Beer : బీర్లు పిరమైనయని.. కల్లు తాగుడు మొదలుపెట్టిర్రు.. ధర ఏంతకు పెరిగిందంటే..

Beer : ఆమ్దాని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీర్ల ధరలను పెంచింది. మందుబాబులకు షాక్ ఇచ్చింది. పథకాలు అమలు చేయాలంటే పైసలు కావాలి.. పైసలు ప్రభుత్వం అనుకున్నంత రాకపోవడంతో అనివార్యంగా బీర్ల ధరలు పెంచింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 15, 2025 / 09:10 AM IST
    Beer

    Beer

    Follow us on

    Beer : ఎండాకాలంలో బీర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం బ్రాండ్లపై ప్రభుత్వం ఏకంగా 20 రూపాయల చొప్పున పెంచింది. సర్కారు నిర్ణయాన్ని అదునుగా చూసుకొని వైన్ షాపు నిర్వాహకులు కూడా నాన్ ప్రీమియం బ్రాండ్లపై పెంచిన ధరలను వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు మరింత చిల్లు పెడుతున్నారు. ఇదేందని మందుబాబులు అడిగితే.. కొంటె కొనండి లేకపోతే లేదు అని సమాధానం చెబుతున్నారు. తాగుడుకు మరిగిన ప్రాణం కాబట్టి మందుబాబులు కొనకుండా ఉండలేకపోతున్నారు. తాగకుండా ఉండలేకపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం బీర్లకు అంతస్థాయిలో ధర చెల్లించలేక కల్లు వైపు మళ్ళుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణలో కల్లు లభ్యత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ సహజంగా వినియోగం కూడా అధికంగానే ఉంటుంది.

    Also Read : బీర్లు తాగేవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరినట్లే..

    మందుబాబులు రూటు మార్చుకున్నారు

    సహజంగా మద్యం అతిగా తాగితే ఆరోగ్యానికి చేటు తెస్తుంది. కల్లు సహజ సిద్ధంగా ఏర్పడింది కాబట్టి.. దానిని సహజమైన ప్రక్రియలోనే తీస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే మందు స్థాయిలో కల్లు కిక్కు ఇవ్వదు. అయితే ఆరోగ్యానికి మాత్రం కల్లు మంచి చేస్తుంది.. అందువల్లే మందుబాబుల్లో కొంతమంది కల్లు వైపు మల్లుతున్నారు.. దీంతో కల్లుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంలో బాటిల్ కల్లు 150 దాకా ఉండగా ఇప్పుడు దానిని ఏకంగా 200 దాకా పెంచారు. పండగ రోజుల్లో డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు మరో 50 రూపాయలు పెంచి గౌడ కులస్తులు విక్రయిస్తున్నారు. వాస్తవానికి కల్లు తీయడం అనేది క్లిష్టమైన ప్రక్రియ. అంత ఎత్తున ఉన్న తాటి చెట్టు ఎక్కి కల్లు సేకరించాల్సి ఉంటుంది. గౌడ కులస్తులు ఆ స్థాయిలో ఇబ్బంది పడుతుంటారు కాబట్టే.. కాస్త రేటు పెంచి విక్రయిస్తున్నారు. పైగా తాటి చెట్టు కల్లు ఎండాకాలం, వాన కాలంలో మాత్రమే అవుతుంది. అప్పుడు మాత్రమే గౌడ కులస్తులకు ఉపాధి ఉంటుంది. ఇక మిగతా రోజులంతా వాళ్ళు ఖాళీగా ఉండాల్సిందే. అందువల్లే తాము రేటు పెంచి విక్రయిస్తున్నామని గౌడ కులస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ తమకు అంతంత మాత్రం గానే గిట్టుబాటు అవుతోందని గౌడ కులస్తులు చెబుతున్నారు. మరోవైపు ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది మందుబాబులు మద్యానికి బదులుగా కల్లు తాగుతున్నారు. ఇక హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు కల్లు కోసం చాలా దూరం ప్రయాణిస్తున్నారు. సిటీ దాటి వెళ్లిపోయి శని, ఆదివారాల్లో కల్లు రుచిని ఆస్వాదిస్తున్నారు. కొంతమంది అయితే మందుకు వీడ్కోలు పలికి.. కల్లును ప్రశాంతంగా తాగుతున్నారు. ఆ రుచిని ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్నారు. ప్రకృతి ప్రసాదించిన వరం అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

    Also Read : బీర్‌ పొంగలేదని విక్రయదారు ఆందోళన.. అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్న మందుబాబులు!