
అది నిండు సభ.. అధికార, ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ మంత్రి అధ్యక్షత వహించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే హాజరయ్యారు. రేషన్ పంపిణీ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రసాభాసకు దారితీసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది.
ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో మంత్రి జగదీశ్ రెడ్డిపైకి కోపంగా వెళ్లి ఆయన చేతిలోని మైక్ తీసుకొని లాక్కోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
ఇక కిందనున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో గందరగోళానికి దారితీసింది. మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరుపై నిప్పులు చెరిగారు. 60ఏళ్లలో ఏం చేయలేని నేతలు ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల మధ్య ఫైటింగ్ జరిగింది. రెండు వర్గాలు తోసుకొని కొట్టుకున్నారు.