BC Politics In AP: ఏపీలో కులాల లెక్కల అధికం. ఇక్కడ జరిగిన కుల రాజకీయాలు దేశంలో మరెక్కడా జరగవు. అయితే కులాల ఆరాటమే తప్ప ఎక్కువ జనాభా ఉన్న కులాలకు మాత్రం ఒనగూరే ప్రయోజనం లేకుండా పోతోంది, మేము మీ కులానికి అదిస్తాం.. ఇదిస్తాం.. దేశంలో ఎవరూ ఇవ్వనంతగా ప్రాధాన్యమిస్తామని చెబుతున్నారు. కానీ ఇలా ప్రకటిస్తున్న వారు కూడా సమాజంలో ఒకటి, రెండు శాతం ఉండే సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో ఆ హామీలేవీ అమలు కావడం లేదు. ఒక విధంగాచెప్పాలంటే ఏపీ సమాజంలో అధికంగా ఉండే కులాలతో ఒకటి, రెండు శాతం కులాలు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ అది. కానీ దానిని గుర్తించని ప్రజలు రాజకీయ క్రీడలో సమిధులుగా మారుతున్నారు. ఇప్పుడు వెనుకబడిన వర్గాల వారిదీ అదే పరిస్థితి. రాజకీయ పార్టీల తలరాతలు మార్చే శక్తి ఉన్న బీసీలను ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి పరితపించే క్రీడలోనే గర్జనలు, ఆందోళనలు.

బీసీలంటే ముందుగా గుర్తొచ్చేది యాదవులు, కురుబులు, విశ్వ బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, నేతన్నలు, గీత కార్మికులు, శ్రీయన, గౌడలు, రజకులు..ఇలా బీసీ జాబితాలో 137 సామాజికవర్గాలున్నాయి. ఏపీ సమాజంలో ఉండే 2.5 కోట్ల ఓటర్లు వారే. అంటే దాదాపు ఏపీ రాజకీయాలను శాసించే ఈ వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగినంత లేదు. బీసీల్లో ఒకటి, రెండు కులాలు తప్ప మిగతా 100కు పైగా కులాలకు గుర్తింపు అంతంతమాత్రమే. కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఆయా కులంలో యాక్టివ్ గా ఉన్న నాయకులను కొలువులిచ్చిన ప్రభుత్వం.. కులాన్ని కంట్రోల్ చేయడానికి వారిని ఉపయోగించుకుంటోంది. కానీ కులంలో వెనుకబడిన వర్గాలకు రుణ రాయితీలు, ప్రత్యేక పథకాలు అంటూ ఏవీ లేకుండా చేసింది. ఫలితంగా వారు పేరుకే బీసీలు కానీ.. వెనుకబాటు దాటిన అగ్రవర్ణాల కింద ప్రభుత్వం ట్రీట్ చేస్తోంది.
ఏపీలో 80 లక్షల మంది యాదవులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వారి రాజకీయ ప్రాతినిధ్యం చేతివేళ్లపై లెక్కించవచ్చు. అలాగని ఈ కులానికి ఎటువంటి ప్రోత్సాహం లేదు. గత ప్రభుత్వాలు అందించిన చాలా రకాల పథకాలను ప్రభుత్వం నిలిపివేసింది. గొర్రె, మేక పిల్లలను అందించేది. ప్రమాదంలో, విపత్తులో చనిపోతే పరిహారం సైతం దక్కేది. వారికి ప్రత్యేక రుణ రాయితీ అంటూ ఏదీలేదు. అవన్నీ ఇస్తామని చెప్పినందుకే గత ఎన్నికల్లో యాదవులు వైసీపీకి సపోర్టు చేశారు. కానీ గత మూడున్నరేళ్లుగా మొండిచేయి చూపడంతో ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కుటుంబాలు 5 లక్షలకుపైగా ఉన్నాయి. ఈ కులంలో దాదాపు 80 శాతం మంది కులవృత్తినే ఎంచుకుంటారు. కానీ వీరికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఎక్కడో స్థానిక సంస్థల్లో తప్పించి ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వాల హయాంలో ఆదరణ వంటి పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. పథకం ద్వారా అందించిన సామగ్రి వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆదరణ పథకం నిలిచిపోయింది. అటు 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉచితమన్న హామీ కూడా సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. ఆ వర్గంలో కూడా అసంతృప్తి నెలకొంది.

గీత కార్మికుల వేదన అంతా ఇంతాకాదు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత గా పిలవబడే సామాజికవర్గాలన్నీగీత కార్మికులుగానే ఉపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వం వీరి కోసం రూ.70 కోట్లతో ప్రత్యేక నిధిని కేటాయించింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీలు ఏర్పాటుచేసి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకూ రుణరాయితీ, బీమా పథకం అమలుచేసేవి. కానీ వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రుణ రాయితీ పథకాలన్ని నిలిచిపోయాయి. దీంతో గీత కార్మికుల్లో సైతం అసంతృప్తి జ్వలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పుడు ఈ వర్గాలన్నీ సంఘటితమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ బీసీ గర్జన నిర్వహించి వారిలో ఉన్న కోపాన్ని తగ్గించాలని ప్రయత్నించింది. కానీ ఇది అంతగా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు.