Munugode By Election- TRS: తెలంగాణలో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల లక్ష్యం ఒక్కటే. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడమే వారి ముందు ఉన్న పెద్ద టార్గెట్. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తమదైన స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు మునుగోడు ఉప ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న టీఆర్‌ఎస్.. ఇంకా అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నా.. టీఆర్‌ఎస్ మాత్రం నాన్చుడు ధోరణిలో ఉంది. ఇది టీఆర్‌ఎస్ వ్యూహమా లేక అభ్యర్థి ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందా ? అన్నది అర్థంకావడం లేదు. అభ్యర్థిని ప్రకటించకపోయినా.. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు.

దూరంగా ఉంటున్న బీసీ నేతలు..
మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలే ఉన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో కీలకమైన బీసీ నేతలు మాత్రం టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇది ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలతోపాటు గతంలో భువనగిరి ఎంపీగా పని చేసిన బూర నర్సయ్యగౌడ్ కూడా మునుగోడులో టీఆర్‌ఎస్ తరçఫున∙ప్రచారం చేయడం లేదు. ఈసారి టీఆర్‌ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో అక్కడి బీసీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఆ నేతలంతా పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అంతర్గత సమస్యలు అనేకం..
మునుగోడులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో టీఆర్‌ఎస్‌కు అక్కడ అనేక అంతర్గత సమస్యలు ఇబ్బందిగా మారాయని.. వాటిని సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరిస్తేనే బాగుంటుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ అంశాలన్నీ సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని.. వాటిని పరిష్కరించిన తరువాతే అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారని కొంతమంది చెబుతున్నారు. ఇక పార్టీలోని నేతల అసంతృప్తిని పట్టించుకోకుండా ముందుకు సాగితే.. టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో కూడా సాగుతోంది.
కూసుకుంట్లకు హామీ?
ఒకవైపు బీసీ నేతలు పార్టీకి దూరంగా ఉంటుంటే.. మరోవైపు టికెట్‌పై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. రాజినామా ఆమోదం పొందిన వెంటనే నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నేతలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సమావేశమై కూసుకుంట్లకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆయనకు టీఆర్‌ఎస్ టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వమని స్పష్టంగా చెప్పారు. అయినా గులాబీ బాస్ వీటిని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. తన ధోరణిలోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. కూసుకుట్లకు ప్రత్యామ్నాయంగా ముగ్గురు, నలుగురు ఉన్నప్పటికీ వారిని కేసీఆర్ పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది. అధికారికంగా కూసుకుంట్ల పేరు ప్రకటించకపోయినా.. సీఎం మామీతోనే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నట్లు గులాబీ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.

బీసీ నేతలతో చర్చిండం అనుమానమే?
కూసుకుంట్లకు పేరును అధికారికంగా ప్రకటించే ముందు పార్టీలోని బీసీ నేతలతో సీఎం చర్చిస్తారని ఆ పార్టీలోని కొందరు చెబుతున్నారు. మరికొందరు కేసీఆర్ అసలు బీసీల అభిప్రాయాన్ని లేక్కచేయడం లేదని అలాంటప్పుడు సమావేశం నిర్వహిస్తారన్న ఆశ లేదని పేర్కొంటున్నారు. ఇదే సరిగితే దాని ప్రభావం ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిసిప్తుందని చెబుతున్నారు.