బతుకమ్మ.. ఈ పండుగ వస్తోందంటే తెలంగాణ ఆడపడుచుల్లో ఆనందం అంతాఇంతా కాదు. తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ పాటలు మారుమోగుతూనే ఉంటాయి. అలాంటి బతుకమ్మ పండుగ విషయంలో ఈసారి కొంత కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఈ సంవత్సరం అధిక మాసం రావడంతో పండుగ తేదీల మీద అందరిలోనూ సందేహాలు ఏర్పడ్డాయి.
Also Read: కో‘దండమే’.. పోటీకి భయపడుతున్న కేసీఆర్?
‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలో పండితులంతా చర్చించి పండుగ తేదీలను నిర్ణయించారు. ఈ మేరకు పండుగను ఎప్పుడు జరుపుకోవాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. అధిక ఆశ్వయుజ మాసాన్ని పరిగణనలోకి తీసుకుని, ఏటా మాదిరిగా భాద్రపద అమావాస్య రోజు కాకుండా అధిక ఆశ్వయుజ అమావాస్య రోజు (అక్టోబరు 16)న ఎంగిలి పూల బతుకమ్మ పండుగను ప్రారంభించాలని నిర్ణయించారు. నిజ ఆశ్వయుజ అష్టమి (అక్టోబరు 24) దాకా తొమ్మిది రోజులపాటు పండుగను జరుపుకోవాలన్నారు.
భాద్రపదమాసంలో వచ్చే ఎంగిలిపూల అమావాస్య రోజు బతుకమ్మను ప్రారంభించాలని కొంతమంది ప్రతిపాదించినా.. ‘మొదటి రోజు చేసుకునే గౌరమ్మకు నెలరోజులపాటు పూజలు చేసుకుని, అక్టోబరులో వచ్చే దుర్గాష్టమి వరకు నిమజ్జనం చేయవచ్చు. కానీ, బతుకమ్మను ప్రారంభించి, పూజలు చేయకపోవడం సరైనది కాదని వేదపండితులు తెలిపారు’ అని కవిత వివరించారు.
Also Read: మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?
ప్రతీ 19 ఏళ్లకోసారి ఇలాంటి పరిస్థితి వస్తుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని చెప్పారన్నారు. ‘తెలంగాణ విద్వత్సభ’ సూచించినట్లు బతుకమ్మ పండుగను అక్టోబరు 16 నుంచి, 24 వరకు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. కవితను కలిసిన వారిలో ‘తెలంగాణ విద్వత్సభ’ రాష్ట్ర అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన శర్మ ఉన్నారు.