అనిశ్చితికి మారుపేరైన కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మరో ముఖ్యమంత్రి తెరపైకి వచ్చారు. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొలువుదీరారు. ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తాజాగా బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ సీఎం యడ్యూరప్పతో కలిసి ఆయన రాజ్ భవన్ కు చేరుకున్నారు.
ఇప్పటిదాకా బీజేపీ సీఎంగా ఉన్న యడ్యూరప్ప దిగిపోయారు. అయితే ఆయన ప్రధాన అనుచరుడైన బసవరాజును సీఎంను చేయడంలో యడ్డీ కీలకంగా వ్యవహరించారు. కర్ణాటక కేబినెట్ లో హోంమంత్రిగా ఉన్న బసవరాజు బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం.
శాసనసభా పక్ష సమావేశంలో బసరాజు బొమ్మై పేరును యడ్యూరప్ప ప్రతిపాదించారు. దీనికి బీజేపీ నాయకత్వం అంతా ఆమోదించారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన పేరును యడ్యూరప్ప ప్రతిపాదించగా.. మాజీ డిప్యూటీ సీఎం గోవింద కారజోళ ఆమోదించారు.
కర్ణాటక సీఎం రేసులో దాదాపు 10మంది ఆశావహుల పేర్లు , పరిశీలనలో ఉన్నా చివరకు ఈ బసవరాజు పేరునే అధిష్టానం ఖరారు చేసింది.
ఇక బసవరాజుకు డిప్యూటీగా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం విశేషం. గోవింద కారజోళ , బి.శ్రీరాములు, ఆర్. అశోక్ లు డిప్యూటీ సీఎంలుగా కన్నడ కేబినెట్ లో కీరోల్ పోషించనున్నారు.