ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి పెద్ద ముప్పును ఎదుర్కొంటోంది. దివాలా అంచున చిక్కకున్న రాష్ట్రం.. ఒడ్డున పడుతుందా? లోతులో పడిపోతుందా? అనేది ఇప్పుడు చర్చ. రాష్ట్ర అవసరాల కోసం ప్రతీ మంగళవారం బాండ్ల వేలం ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి 2 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటోంది. గతవారం రావాల్సిన అప్పుకే నానా అవస్థలు పడింది. చివరకు ఎలాగోలా ఈ మంగళవారం సాధించింది. అప్పు ఇవ్వడానికి ఆర్బీఐ అంగీకరించింది.
దీంతో.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ కష్టాలు ఈ నెల వరకు తొలగిపోయినట్టేనని రాష్ట్ర సర్కారు ఊరట చెందింది. కానీ.. ఉన్నట్టుండి ట్విస్టు ఇచ్చింది ఆర్బీఐ. ఇచ్చిన అప్పును ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో జమ చేసుకుంది. ఇప్పటికే ఏపీ సర్కారు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకుంది. దీంతో.. ఆ అప్పును రిజర్వు బ్యాంకు జమచేసుకుంది. వీటితోపాటు.. లోటు కింద కేంద్రం విడుదల చేసిన మరో 1400 కోట్ల రూపాయలను కూడా ఇదేవిధంగా జమ చేసుకుంది. ఇంకా.. 8 వందల కోట్ల రూపాయలు ఓడీ ఉంది.
ఫలితంగా.. రాష్ట్రానికి అప్పు లభించినప్పటికీ.. నిధులు మాత్రం చేతికి అందలేదు. దీంతో.. ఇప్పుడు ఉద్యోగుల జీతాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా.. మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్ కే వెళ్లే అవకాశం ఉంది. అయితే.. దానికి కూడా పలు నిబంధనలు ఉన్నాయి. తాత్కాలిక అవసరం కోసమే ఓడీ ఇస్తారు. అది కూడా 1400 కోట్ల కన్నా.. తక్కువగా తీసుకుంటే 14 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే.. నాలుగు రోజుల్లోనే తిరిగివ్వాలి.
ప్రస్తుతానికి అయితే.. ఇంకా కొందరికి జీతాలు పడలేదు. పలువురికి పెన్షన్లు కూడా అందలేదు. మరి, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక వేళ ఓడీ తీసుకుంటే.. తిరిగి గడువులోగా చెల్లించగలుగుతుందా? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ అప్పు తీసుకొని చెల్లించలేకపోతే ఏం చేస్తుంది అంటే.. రాష్ట్రం దివాళా తీసినట్టుగా ప్రకటిస్తుంది. మరి, ఈ గండం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.