Bangladesh Provoking India: బంగ్లాదేశ్.. ఏడాది క్రితం వరకు మనకు మిత్ర దేశం. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేక శక్తిగా మారింది. భారత్‌తో స్నేహంగా ఉన్నన్ని రోజులు మన భారతీయులు బంగ్లాదేశ్‌కు, బంగ్లాదేశీయులు భారత్‌కు రాకపోకలు సాగించేవారు. సరిహద్దు సైనికులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు బీ టీంగా మారింది. మతోన్మాద దేశంగా మారి సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతోంది. తాజాగా బంగ్లాదేశ్ కోస్టుగార్డ్ దళాలు భారత మత్స్యకారులు తమ జలాలకి ప్రవేశించారంటూ పట్టుకోవడం ఉద్రిక్తత రేకెత్తించింది. దీనికి ప్రతిగా భారత తీరగస్తీ దళాలు 29 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నాయి. మనవారిని వదిలేస్తే.. బంగ్లాదేశీయులను వదిలేస్తామని భారత్ స్పష్టం చేసింది.
పెరుగుతున్న మతరాజకీయ ధోరణి..
ఒకప్పుడు సెక్యులర్ భావజాలం ప్రతీకగా నిలిచిన బంగ్లాదేశ్ క్రమంగా మతోన్మాద ప్రభావంలోకి జారిపోతోంది. దక్షిణ ఆసియాలో కొత్త మతపరమైన ఉద్రిక్తతలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించాలన్న ప్రయత్నం క్రమంగా సరిహద్దుల్లో ప్రతిఫలిస్తోంది. పాక్ శైలిలో సరిహద్దు కదలికలతో భారత్‌ను పరీక్షిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు 4 వేల కిలోమీటర్లు ఉంటుంది. ప్రజల రాకపోకలు, నిర్బంధం లేని వాణిజ్యం, సముద్రంతోడి మత్స్యకార కార్యకలాపాలు తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. గత కాలంలో సైన్యం కేవలం భద్రత కాపలా వరకు పరిమితం కాగా, ఇప్పుడు రాజకీయ అర్థం కలిగిన చర్యల్లో భాగం అవుతోంది.
కవ్వింపు చర్యలు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను దెబ్బతీసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తన అంతర్గత రాజకీయ లాభాల కోసం సరిహదు ఉద్రిక్తతలు పెంచుతోంది. దీంతో భారత–బంగ్లా సంబంధాలు క్షీణించే ప్రమాదం ఉంది. పరస్పర విశ్వాసం, బాధ్యతగల సంభాషణ మార్గం ద్వారా మాత్రమే ఈ ఉద్రిక్తతను సమతుల్యం చేయవచ్చు.