Bandi Sanjay- MLC Kavitha: తెలంగాణలో రాజకీయాలు మంచి ఫైర్మీద కొనసాగుతున్నాయి. దర్యాప్తు సంస్థలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రశ్చన్న యుద్ధంలో ప్రస్తుతం కేంద్రానిదే పైచేయి సాధించింది. దీంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్‌ను కుటుంబాన్ని తెలంగాణలో డ్యామేజ్ చేయడానికి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ మరోమారు కేసీఆర్, ఆయన కూతురు కవితపై విరుచుకుపడ్డారు.

ఇటీవల జగిత్యాలలో పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ సభలో… అధికార పార్టీ నేతలు విద్యార్థులతో కుర్చీలు వేయించడంపై మండిపడ్డారు. ఇంకా వారితో ఎన్నో పనులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది అని ఎద్దేవా చేశారు. దేశంలో చైనా బజార్లు అని అంటున్న కేసీఆర్ కు సిగ్గుండాలి అని పేర్కొన్న బండి సంజయ్ చైనా బజార్లను భారత్ బజార్లుగా మార్చిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే… మతతత్వం రెచ్చగొట్టినట్టా? అని ప్రశ్నించారు. సంఘ విద్రోహ శక్తులు జగిత్యాల్ అడ్డాగా మారిందని, పీఎఫ్ఐ అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు ఫండింగ్ చేస్తున్నది కేసీఆర్ పార్టీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆలయాల అభివృద్ధికి సహకరించడం లేదు..
తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ సహకరించటం లేదని బండి సంజయ్ ఆరోపించారు. వేములవాడ ఆలయాన్ని ‘ప్రసాదం స్కీం’ కింద అభివృద్ధి చేద్దామంటే… కేసీఆర్ సహకరించడం లేదన్నారు. వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అన్న కేసీఆర్.. నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. బాసర ఆలయం అభివృద్ధికి రూ.120 కోట్లు అన్న కేసీఆర్. ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అంటున్నారని విమర్శించారు. కొండగట్టులో కేసీఆర్ బిడ్డ కవిత ఏదైనా జాగా కొన్నదేమో అని, అందుకే ఇప్పుడు 100 కోట్ల రూపాయలని అంటున్నాడని ఆరోపించారు.

బతుకమ్మను అవమానించిన పాపం ఊరికే పోదు..
తెలంగాణలో బతుకమ్మను కించపరిచిన పాపం కవితకు తగులుతుందని సంజయ్ అన్నారు. బతుకమ్మ పేరు మీద డిస్కో డాన్సులు చేసిందని, మన సంప్రదాయాన్ని, బతుకమ్మను కించపరిచిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ తల్లిని కించపరిచిన కేసీఆర్ బిడ్డ ఇప్పుడు లిక్కర్ దందాలో ఇరుక్కుందని, పాపం ఊరికే పోతుందా అని విమర్శించారు. కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ దందా చేసిందని, దొంగ దందా చేసిన కవిత సింహం, పులి బిడ్డ నా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంలో 65 మంది పేదోళ్లు చనిపోతే… ఒక్కసారైనా కేసీఆర్ వచ్చి, సంతాపం ప్రకటించాడా..? ఆ బాధిత కుటుంబాలను ఆదుకున్నాడా…? కనీసం ఆ కుటుంబాలను పరామర్శించాడా? అని ప్రశ్నించారు. తన బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. ఒకవేళ అదే జరిగితే కెసిఆర్ ను బయటకు లాగుతామన్నారు. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చ అని పేర్కొన్న బండి సంజయ్ కేసీఆర్ ఢిల్లీకి పోయాడని, ఇక అటే పోతాడని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరు నుంచి ‘తెలంగాణ’ పదాన్ని తీసేశాడని, తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని, తెలంగాణ తల్లికి ద్రోహం చేశాడని మండిపడ్డారు.