Pawan Kalyan Varahi: రాజకీయాల్లో హుందాతనం చూసి చాన్నళ్లయ్యింది. సైద్ధాంతిక పోరాటం కాదు.. ఇప్పుడంతా వ్యక్తిగతమే. అందునా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంతా రాజకీయ వికృత క్రీడే. రాజకీయాన్ని రాజకీయంలా చూడడమే మానేశారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ అందరిదీ ఒకటే స్టైల్. ఒకరిద్దరు ఆలోచించే నాయకులు ఉన్నా వారి మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. మూర్ఖత్వంతో తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అని పట్టుపట్టి మరీ అదే మాటపై ఉండిపోవడం జగన్ అండ్ కోకు అలవాటుగా మారిపోయింది. అధికారం ఉంది కదా అదే నిజమని భావించే వారూ ఏపీ సమాజంలో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులతో ఏ విషయంలో పోరాడాలన్న కనీస ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. పవన్ విషయంలో తీసుకుందాం. ఆయనతో పోరాటం చేయాలే తప్ప.. ఆయన వినియోగించనున్న ప్రచార రథం ‘వారాహి’పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. నిషేధిత వాహనంగా చూపి అర్ధం పర్థం లేని యుద్ధాన్ని ప్రారంభించి తెలుగునాట నవ్వుల పాలయ్యారు.

ఆ వాహనం కలర్ గురించి ఎంత రచ్చ చేయాలో అంత చేశారు. భారత త్రివిధ దళాల గురించి అవపోసిన పట్టినట్టు.. వారాహి వాహనం ఆర్మీ నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని విష ప్రచారం మొదలు పెట్టారు. అలివ్ గ్రీన్ కలర్ వాడకూడదని దేశభక్తితో కూడిన మాటలు చెప్పారు. వాహనం స్థాయికి మించి ఉందని.. లారీ చాసీతో తయారు చేశారని.. టైర్లు కూడా మైనింగ్ కు వినియోగించి టిప్పర్ల మాదిరిగా ఉన్నాయని లేనిపోని ప్రచారం చేశారు. అయితే మైనింగ్ అనే విషయానికి వచ్చేసరికి దానికి ఏ యంత్రాలు, ఏ పరికరాలు, ఏ వాహనాలు వినియోగిస్తారో వైసీపీ నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని సైటైర్లు సైతం పేలేందుకు అవకాశమిచ్చారు. రిజిస్ట్రేషన్ కు రవాణా శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారని కూడా ప్రచారం మొదలు పెట్టారు. కానీ రిజిస్ట్రేషన్ ను తెలంగాణ రవాణా శాఖ అధికారులు సవ్యంగా పూర్తిచేశారు. అన్ని సరిపోయాయని తేల్చుతూ వాహనానికి నిరభ్యంతర సర్టిఫికెట్ సైతం ఇచ్చారు. దీంతో వైసీపీ పేటీఎం బ్యాచ్ ది ఉత్త ప్రచారంగా తేలిపోయింది.
అయితే వారాహి వాహనం ఎపిసోడ్ లో వైసీపీ నేతల వైపు ఏపీ ప్రజలు వింతగా చూస్తున్నారు. అంతన్నారు.. ఇంతన్నారు.. ఏంటి ఇది అంటూ కోపం, కామెడీతో కలగలిపిన చూపులు చూశారు. ఇటువంటి సీన్ లో ఎంటరయ్యే అలవాటు ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చేశారు. ఇంతటితో సినిమా అయిపోలేదు. ఇంకా ఉందంటూ సెలవిచ్చారు. ఆ వాహనం ఏపీలో ఎలా తిరుగుతుందో చూస్తామంటూ హెచ్చరించేలా మాట్లాడారు. అది ఏపీ నిబంధనకు విరుద్ధమంటూ చెప్పుకొచ్చారు. రంగులు చూసే విధానం రాష్ట్రాలకు మారుతుందేమో కానీ.. నేషనల్ పర్మిట్ ఇచ్చే వాహనాలకు కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిన్న లేదు మొన్న పవన్ మార్షల్ ఆర్ట్స్ ఫొటోపై కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కయిన అమర్నాథ్ ఇప్పుడు వారాహి వాహనంపై తనకు తెలిసీ తెలియని కామెంట్స్ చేసి మరోసారి దొరికిపోయారు.

అన్ని నిబంధనలు చూసి తెలంగాణ రవాణా శాఖ అధికారులు వారాహి వాహనానికి నేషనల్ పర్మిట్ ఇష్యూ చేశారు. అంటే ఏ రాష్ట్రంలోనైనా ఆ వాహనం తిరిగేందుకు అనుమతులుంటాయి. ఇది తెలియని మంత్రి అమర్నాథ్ నోరుజారారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీ డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి.. ఏపీ ప్రభుత్వం మీ వాహనాల రంగులు మార్చేస్తోంది జాగ్రత్త అంటూ నెటిజెన్లుకామెంట్లు పెడుతున్నారు. వాటినే వైరల్ చేస్తున్నారు. కేవలం ఒక వాహనంపై రాజకీయ ప్రతీకారంతో వైసీపీనేతలు రగిలిపోతున్నారు. దీనిని బట్టి పవన్ ను ఏ స్థాయిలో వారు ట్రీట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.