
కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గతంలో ఏపీతో చేసుకునన ఒప్పందాలతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. 68 శాతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీటిని తీసుకునేందకు ఒప్పుకున్నారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ తానే ఏదో చేస్తున్నట్లు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన అన్యాయానికి దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేసీఆర్ సంతకాలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు
2015 జూన్ 18,19 తేదీల్లో మొదటిసారి రెండు స్టేట్ల మధ్య జరిగిన భేటీలో నీటి వాటాలపై ఒప్పందం కుదిరిందన్నారు. ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 512టీఎంసీలకు ఒప్పందం కుదిరిందన్నారు. తర్వాత 2016లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ రాష్ర్ట ప్రభుత్వం ఇదే చెప్పిందన్నారు. తానే ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు ఏదో జరుగుతోందని రాజకీయ దుమారం చేయడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు.
ఆగస్టు 12,2019లో నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అక్కడ రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ గుర్తు చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీకి ఇవ్వాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఇప్పుడు అవేమీ తెలియనట్లుగా నటిస్తూ నాటకాలు ఆడటం సరైంది కాదని సూచించారు.
ఏపీ ప్రభుత్వ జీవోపై ఆనాడే బీజేపీ స్పందించిందన్నారు. తానే స్వయంగా జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాశానని గుర్తు చేశారు. ప్రజలు తిరగబడతారనే ఉద్దశంతో చీఫ్ ఇంజినీర్ రజత్ కుమార్ తో కేంద్రానికి లేఖ రాయించారని పేర్కొన్నారు. ఏపీతో ఒప్పందం కుదుర్చుకుని రజత్ కుమార్ తో లేఖ రాయించి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.
కృష్ణా జలాల విషయంలో తాను మాట్లాడేది అబద్దమని తేలితే శ్రీశైలం డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంది తప్పయితే ఏం చేస్తారని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందులో అవాస్తవాలు ఉంటే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులు ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.