జాతి, కుల, మతాలా పేరుతో దేశ ప్రజలను విచ్ఛన్నం చేసిన ఘనత నేటి రాజకీయాలను ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందు వరుసలో ఉందనేది అనేకమంది విశ్లేషకుల మాట. అందుకు తగినట్లుగానే ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తుంటారు. తాజాగా వినాయక చవితి సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ రెచ్చి పోతున్నారు. పదే పదే హిందూ, ముస్లింల పండుగలను ప్రస్తావిస్తూ.. రంజాన్, బక్రీద్, వినాయక చవితి సమయాలలో సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్న ఆంక్షల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ… కేసీఆర్ ని హిందూ వ్యతిరేక వ్యక్తిగా ప్రజల ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన నిరసనలకు బీజేపీ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బండి సంజయ్ కుమార్ అన్నారు. గణేశ్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందని, రంజాన్, బక్రీద్ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛను, బోనాలు, వినాయక చవితి సందర్భంగా విధించిన ఆంక్షలను ప్రజలు గమనించారని అన్నారు.
సీఎం కేసీఆర్ తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని, జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వినాయక మంటపాలు తొలగించిన స్థలాల్లో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. శాంతియుతంగా నిరసన ప్రదర్శించాలని రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులు ధర్మ పరిరక్షణ కోసం స్పందించాలని ఆయన అన్నారు.
ఒవైసీల మెప్పు, ఓ వర్గం ప్రజల సంతుష్టీకరణ కోసం సీఎం కేసీఆర్ నవరాత్రి ఉత్సవాలపై నిర్బంధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసు పహారా, నిఘా అధికారుల పర్యవేక్షణలో ఆంక్షల మధ్య హిందువులు ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి కల్పించిన ఘనత భయంకరమైన హిందువుకే దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. భయంకరమైన హిందువునని చెప్పుకునే కేసీఆర్, పండుగ పూట హిందువుల్ని భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఇదేనా భయంకరమైన హిందువు అనే మాటకు అర్థమని ఆయన ప్రశ్నించారు.
ఈ విధంగా బీజేపీ నేతలు చేసే ప్రతి విమర్శను హిందూ మతానికి లింక్ చేసి తోటి రాజకీయ నాయకులను హిందూ వ్యతిరేక వ్యక్తులుగా చేయడం బీజేపీ మత రాజకీయాలకు తార్కాణం. అయితే మన భారతదేశం లౌకికరాజ్యం అనే సత్యాన్ని బీజేపీ నేతలు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అన్ని మతాలను గౌరవించవలసిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది.