
పాదయాత్రలో సమస్యలు వెళ్లబోసుకున్న ప్రజలకు బండి సంజయ్ భరోసా
ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం
టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వెల్లువెత్తిన ఫిర్యాదులు
ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం సంగూపేట్ నుండి ప్రారంభమై ఆందోల్, జోగిపేట, రోళ్లపాడు, అన్నాసాగర్ మీదుగా చాముండేశ్వరి ఆలయం వరకు సాగింది. దారిపొడవునా జనం బండి సంజయ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీఆర్ఎస్ పాలన విరగడ కావాలని కొందరు….బీజేపీ అధికారంలోకి వస్తేనే తమకు మేలు జరుగుతుందని ఇంకొందరు….తమ సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని మరికొందరు…ఇలా బండి సంజయ్ కుమార్ ను కలిసిన ప్రతి ఒక్కరూ తమ బాధలను పంచుకున్నారు. అందరి సమస్యలను ఓపికగా వింటూనే వారికి ‘‘నేనున్నాను. మీరేం బాధపడకండి. మీకు బీజేపీ అండగా ఉంటుంది. మీ తరపున ప్రభుత్వంపై పోరాడతాం’’అని భరోసా ఇస్తూనే ముందుకు సాగారు. దారిలో బండి సంజయ్ ను కలిసిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ కాంట్రాక్ట్ టీచర్లు తమకు బస్ సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, తమకూ PRC అమలుచేయించాలని కోరుతున్నా స్పందన లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు బండి సంజయ్ కుమార్.
పాదయాత్రలో విద్యా వలంటీర్లు కలిసి తమను ఉద్యోగాల నుండి తీసివేయడంతో బతుకే భారమైందని వాపోయారు. ఆందోల్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా టీచర్లు కలిసి కనీసం సొంత బిల్డింగ్ లేదని వాపోయారు. దారిపొడవునా పలువురు రైతులు కలిసి వర్షాలవల్ల పంట నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోయారు. ఇక యువత పెద్ద ఎత్తున బండి సంజయ్ ను కలిసి కలిసి ఉద్యోగాలు రావడం లేదని, నోటిఫికేషన్ వెలువడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. వెళ్లిన ప్రతిచోట ప్రజలు కలిసి తమ వాడల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని మొరపెట్టుకున్నారు. దారిలో ముదిరాజ్ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ చిరంజి ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు ముదిరాజ్ లు కలిసి రాష్ట్రంలో ముదిరాజ్ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ లను బీసీ-డి జాబితా నుండి బీసీ-ఏ జాబితాలోకి మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.18 సంవత్సరాలు నిండిన ముదిరాజ్ యువకులకు ముదిరాజ్ సొసైటీల్లో సభ్యత్వం కల్పించాలని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను కళ్లారా చూసిన బండి సంజయ్ కుమార్ వారికి బీజేపీ అండగా ఉంటుందని, మరో రెండేళ్లు ఓపిక పడితే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెబుతూ ముందుకు కదిలారు. జోగిపేటలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ కు పలువురు పాడై పూర్తిగా కంకర తేలి మట్టికొట్టుకుపోతున్న రోడ్లను చూపిస్తూ… టీఆర్ఎస్ పాలనలో తమ జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయని వాపోయారు. ఈ సందర్భంగా జోగిపేటలో హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసిన బండి సంజయ్ వెంటనే జోగిపేటలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి హాజరై పార్టీ పదాధికారులకు దిశా నిర్దేశం చేశారు. సాయంత్రం 5.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ కు దారి పొడవునా జనం స్వాగతం పలికారు. పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు గుంపులు గుంపులుగా తరలివచ్చి బండి సంజయ్ ను కలిసి ఆయనతో ఫొటోలు దిగారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఏకరవు పెట్టారు. రోళ్లపాడు దారి పొడవునా జనం బండి సంజయ్ కుమార్ కు స్వాగతం పలికారు. అన్నాసాగర్ లో ట్రాన్స్ కో ఉద్యోగులు కలిసి తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని వాపోయారు. ఈ సందర్భంగా ఆయా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను బండి సంజయ్ కుమార్ ద్రుష్టికి తీసుకొచ్చారు.
ఈరోజు పాదయాత్రలో పాల్గొన్న నేతలు : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బాబూమోహన్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కూన శ్రీశైలం, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి, సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, రాకేశ్ రెడ్డి, ఎస్సీ, బీసీ, మహిళా, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఆలె భాస్కర్, గీతా మూర్తి, భాను ప్రకాశ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, యువ నాయకులు ఉదయ బాబూ మోహన్ తదితరులు శనివారం నాటి పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ తో కలిసి నడిచారు.