TS Teachers Transfers: వంద పశువులను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోతుందట. ఎంతటి నియంత అయినా ప్రజాపోరాటానికి తలవంచక తప్పదు. హిట్లరే తిరుగుబాటుతో ఆత్మహత్య చేసుకున్నాడు. గతమైనా.. వర్తమానమైనా వ్యతిరేకత, తిరుగుబాటు మొదలైతే అది విజయం సాధించే వరకూ వెనుకడుగు వేయదు. తాత్కాలికంగా అణచివేతకు గురైనా అంతిమ విజయం మాత్రం తథ్యం ఇది చరిత్ర. ఈ విషయం 80 వేల పుస్తకాలు చదివిన, అపర రాజకీయ చతురత ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రికి ఆలస్యంగా అర్థమైంది. ఏడాదిగా సాగుతున్న ఉపాధ్యాయుల ఉద్యమంతో కేసీఆర్ దిగిరాక తప్పలేదు. ఏడాదిపాటు ఉపాధ్యాయులు ఇబ్బంది పడినా అంతిమంగా విజయం సాధించారని చెప్పవచ్చు.

ఏడాదిగా పోరాటం..
ప్రభుత్వం కొత్త జిల్లాల వారీగ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2021 డిసెంబర్‌లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జీవో 317 జారీ చేసింది. దీని ప్రకారం స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టింది. దీంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి దూరంగా ఉన్న జిల్లాలకు బదిలీ అయ్యారు. నాటి సీఎస్ సోమేశ్‌కుమార్ సూచనతో రూపొందిన జీవో 317 ఉపాధ్యాయులపాలిట శాపంగా మారింది.
స్పౌజ్ బదిలీలపై విక్ష..
ఏ ప్రభుత్వ శాఖలో లేనంతగా ఉపాధ్యాయుల్లో దంపతులు ఎక్కువ. జీవో 317 ముందు వరకు ఒకే జిల్లాలో పనిచేసిన ఉపాధ్యాయ దంపతులు ఈ జీవోతో విడిపోవాల్సి వచ్చింది. దీంతో పిల్లలు తల్లికో తండ్రికో దూరం అయ్యారు. ఈ పరిస్థితిని ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. దీంతో స్పౌజ్ బదిలీలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 33 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాల్సి ఉండగా ప్రాధాన్యం ఉన్న 13 జిల్లాలను బ్లాక్ చేశారు. దీంతో ఉపాధ్యాయులకు మేలు చేస్తున్నట్లే చేసి.. ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏడాదిగా దంపతులు చెరో జిల్లాలో ఉద్యోగం చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నారు.
అండగా నిలిచిన బీజేపీ..
జీవో 317కు వ్యతిరేకంగా, ఉపాధ్యాయులకు అండగా బీజేపీ నిలిచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 317 జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2022 జనవరిలో జీవోకు వ్యతిరేకంగా దీక్షకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి సంజయ్ దీక్షను భగ్నం చేసింది. కరీంనగర్‌లోని తన ఇంట్లో దీక్షకు సిద్ధమైన సంజయ్‌ని పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు జైల్లో పెట్టారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యమం మరింత ఉధృతమైంది. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన సంజయ్ తన అరెస్ట్‌తో కేసీఆర్ పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక జీవో 317 రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా ఉపాధ్యాయులు తమ నిరసనను కొనసాగిస్తూ వస్తున్నారు.
పదోన్నతులు, బదిలీలతో మళ్లీ ఆందోళన..
రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు జీవో 5 విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో బదిలీల ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. అయితే స్పౌజ్ బదిలీలపై ఎలాంటి క్లారిటీ రాకుండా బదిలీలు, పదోన్నతులు చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని ఉపాధ్యాయ దంపతులు మళ్లీ ఉద్యమం ఉధృతం చేశారు. హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎలాంటి హామీ రాకపోవడంతో ప్రగతిభవన్ ముట్టడి తలపెట్టారు. ప్రభుత్వం పోలీసులతో ఆందోళనను అణచివేసింది. దీంతో మళ్లీ బీజేపీ ఉపాధ్యాయుల ఆందోళనకు అండగా నిలిచింది. ఈనెల 30న ఇందిరాపార్కు వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. పదోన్నతులు, బదిలీలతోపాటు స్పౌజ్ బదిలీలు చేపట్టాలని, భార్యాభర్తలకు ఒకే చోట బదిలీలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
దిగిచ్చిన సర్కార్..
ఉపాధ్యాయుల ఆందోళనపై పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించే ఒక్క రోజు ముందు తెలంగాణ సర్కార్ దిగివచ్చింది. స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్ కౌన్సె్సలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరుగనున్నాయి. ఇదే క్రమంలో స్పౌజ్ బదిలీలు కూడా కొనసాగనున్నాయి. చాలా కాలంగా పరిష్కారం కాని టీచర్ల సమస్య తాజా ప్రభుత్వ నిర్ణయంతో పరిష్కారం కానుంది.
ధర్నాకు భయపడే: బండి సంజయ్
ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాకు భయపడే తెలంగాణ ప్రభుత్వం స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇది పూర్తిగా ఉపాధ్యాయులు, బీజేపీ కార్యక్తల విజయమని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం బీజేపీ ఎంత దూరమైనా వెళుతుందిని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి కేసీఆర్‌కు టీచర్లపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. నిజంగా ప్రేమ, చిత్తశుద్ది ఉంటే కొత్త పీఆర్సీని అమలు చేసేవారని, జీవో 317తో స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేసేవారన్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారన్నారు.

ఎన్నికల జిమ్మిక్కే..
ప్రస్తుతం టీచర్ల బదిలీలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికలు ఉండడమే కారణమని సంజయ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఓటమి తప్పదని కేసీఆర్ గుర్తించారని తెలిపారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యతిరేకతతో ప్రభుత్వాలు కూలిపోయాయన్నారు. ఈ విషయం కేసీఆర్‌కు అర్థమైందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కేసీఆర్‌కు కళ్లముందు కనబడిందని అందుకే హడావుడిగా స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కే అని స్పష్టం చేశారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.