తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు యత్నిస్తుంది. అందుకే టీఆర్ఎస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై బీజేపీ దూకుడుగా వెళుతోంది. ప్రధాన ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రను బీజేపీ భుజాన వేసుకొని టీఆర్ఎస్ కు రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను పంపుతోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు పూర్తిగా మద్దతు ఇస్తుండటంతో తెలంగాణలో కమలం బలపడేందుకు శతవిధాలా యత్నిస్తుంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.
2019 ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ సీట్లు మావే అంటున్న బీరాలు పలికిన టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు షాకిచ్చారు. కాంగ్రెస్ మూడు సీట్లు కైవలం చేసుకొని బీజేపీ అనూహ్యంగా నాలుగు సీట్లు సాధించి సత్తాచాటింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అధిష్టానం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై దూకుడుగా వెళుతూ బీజేపీ నేతల్లో జోష్ నింపుతోన్నారు.
అయితే బండి సంజయ్ ఇప్పటివరకు తనకంటూ ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసుకోకపోయానే టాక్ విన్పిస్తుంది. దీంతో తాజాగా బండి సంజయ్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మాత్రమే బండి పెద్దపీఠ వేసి మిగతా జిల్లాలను పట్టించుకోలేదని పలువురు బండిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి గట్టి పట్టున్న ఆదిలాబాద్ జిల్లాకు ఎలాంటి పదవులు దక్కకపోవడంతో ఆ జిల్లా నేతలు బండిపై గుస్స అవుతున్నారు.
గత ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఎంపీగా సోయం బాబురావు గెలిచారు. ఆయన గెలుపు కోసం బీజేపీలోని కిందిస్థాయి నేతలు ఎంతో కష్టపడ్డారు. అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోగానీ, ఇతర అనుబంధ సంఘాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు ప్రాధాన్యత దక్కకపోవడంతో స్థానిక నేతలు బండిపై మండిపడుతున్నారు. జిల్లాలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నా ఏ ఒక్కరికీ అధిష్టానం చాన్స్ ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అధిష్టానంతో తేల్చుకునేందుకు జిల్లా శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ అధిష్టానం ఇచ్చే పిలుపుకు ఈ జిల్లా నేతలు పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ పదవుల్లో వారికి అవకాశం దక్కలేదని టాక్ విన్పిస్తోంది.
కాంగ్రెస్, ఇతర పార్టీలోని సీనియర్లకు బీజేపీలోకి ఆహ్వానించి వారికి పదవులు ఇచ్చే ఆలోచనలు బీజేపీ అధిష్టానం ఉందనే టాక్ విన్పిస్తుంది. ఆదిలాబాద్ లో పార్టీ బలోపేతం చేయాల్సిన అధిష్టానం వారిలో అసంతృప్తిని రగిల్చేలా పదవుల పంపకం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిని కొందరు సీనియర్లు బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కేందుకు వినియోగించుకోవాలని చూస్తున్నారట. ఈ సమస్యను బండి సంజయ్ ఎలా పరిష్కరిస్తారనేది వేచి చూడాల్సిందే..!