Bandi Sanjay- MLA Pilot Rohit Reddy: ‘బండి’ ఏంటి.. భవిష్యవాణి ఏంటీ అనుకుంటున్నారా..? జరగబోయేది ముందే చెబితే భవిష్యవాణే అంటారుకదా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఏస్కాం ఎప్పుడు బయటకు తీస్తారో ముందే చెబుతున్నారు కదా.. అందుకే బండి భవిష్యవాణి చెబుతున్నట్లే కదా.. బండి సంజయ్ అన్నట్టే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం కదా.. ఇప్పుడు బండి భవిష్యవాణి సెటైర్ పొలిటికల్ ప్లాట్‌ఫాంపై చర్చనీయాంశమైంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్‌రెడ్డి ప్రమేయం ఉందని, అందుకే పైలెట్ రోహిత్‌రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డ్రామా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆడించారని నాలుగు రోజుల క్రితం బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రలో పేర్కొన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. నాలుగు రోజులు తిరగకుండానే బండి వ్యాఖ్యలకు తగ్గట్టు పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు అందాయి. ఇప్పుడు ఇది.. రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.

షాక్‌లో గులాబీ టీం..
తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు రావడం.. బీఆర్‌ఎస్ నేతలను షాక్‌కు గురిచేసింది. ఈనెల 19వ తేదీన విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశించడం.. ఏ కేసు విషయంలో రావాలని పేర్కొనకపోవడం పైలట్‌తోపాటు అధికార పార్టీ నేతలను కలవర పెడుతోంది. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారణ చేయనున్నారు. 2014 సంవత్సరం నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీలు వ్యవహారాలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ని ప్రశ్నించనున్నారు. అయితే, తనకు నోటీసులు రావడంపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు అసలు ఏ కేసులో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు.
‘బండి’ చెబితే నోటీస్ ఇచ్చారా?
బండి సంజయ్‌కు చెప్పగానే ఈడీ నోటీసులు ఇవ్వడం ఏమిటన్న చర్చ ఇప్పుపడు రాజకీయాల్లో జరుగుతోంది. తనకు నోటీసులు ఇచ్చే విషయం ఎలా తెలుసు అని రోహిత్‌రరెడ్డి ప్రశ్నించారు. ఈడీ అధికారులు తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందని పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్ తన గురించి వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే, ఈడీ సమన్లు వచ్చాయి అని పేర్కొన్న పైలట్ రోహిత్ రెడ్డి బండి సంజయ్ కి భవిష్యవాణి తెలుసా అంటూ మండిపడ్డారు. దేశంలో సీబీఐ, ఈడీ బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను తాను అడ్డుకున్నందుకే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

సంజయ్‌కు సవాల్..
నాకు ఎలాంటి కేసులతో సంబంధం లేదని పేర్కొన్న పైలట్ రోహిత్‌రెడ్డి తనకు ఈడీ నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈడీ నోటీసులు ఇచ్చినా సీబీఐ ఎంక్వయిరీ చేసినా తగ్గేది లేదని, భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరంగా సమాధానం ఇస్తానని పైలట్ రోహిత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఇక తనపై రకరకాల ఆరోపణలు చేసిన బండి సంజయ్‌కు సవాల్ విసిరిన పైలట్ రోహిత్ రెడ్డి యాదగిరిగుట్టకు తాను తడిబట్టలతో రావడానికి, ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. బండి సంజయ్ ఎప్పుడు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఎటువంటి కేసులతో సంబంధం లేదని మరోమారు తేల్చి చెప్పారు.