హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాదయాత్ర పేరుతో నియోజకవర్గమంతా చుట్టి వస్తున్నారు. 127 గ్రామాల్లో పాదయాత్ర చేసేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి గ్రామంలో కేసీఆర్ కుయుక్తుల్నిఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ తమకు మద్దతు ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు. ప్రజాదీవెన యాత్ర పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కదులుతున్నారు. తమ వ్యూహాల్లో భాగంగా కేసీఆర్ ను మట్టికరిపించే విధంగా పక్కా ప్లాన్ వేస్తున్నారు. డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనేపథ్యంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ఈటలకు మద్దతు తెలపాలని కోరారు. నియంతకు ప్రజాసేవకుడికి మధ్య జరుగుతున్న పోటీగా అభివర్ణించారు. హుజురాబాద్ ఓటర్లు కీలక తీర్పు ఇస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈటలకు సంఘీభావం ప్రకటించారు. ఈటల గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే వచ్చిందన్నారు. ఆ సర్వేలో ఈటలకు 71 శాతం ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థే కరువయ్యారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బు సంచులతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయాల్సిందిగా కోరారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో మలి దశ ఉద్యమం ప్రారంభమైందన్నారు. అది హుజురాబాద్ ఎన్నికల రూపంలో వచ్చిందని పేర్కొన్నారు. ఎవరిని అడిగినా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారని తెలిపారు. ఈటల రాజేందర్ లేకపోతే దళితుల కోసం సీఎం దళిత బంధు తెచ్చేవారు కాదని అన్నారు.
కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ గా పొగడడం బాధాకరమన్నారు. ఆయనకు కేసీఆర్ కు పోలిక ఎక్కడుందని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి అంబేద్కర్ అని అంతటి స్థాయి ఉన్న వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించడం దారుణమన్నారు. హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు హామీ ఇచ్చి దాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. నగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని పేర్కొన్నారు.
దళితబంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా కొద్దిమందికి అందజేసి మరికొందరిని వెయిటింగ్ లో పెడతారని సూచించారు. రాష్ర్టంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ కుట్రలను అందరు గమనిస్తున్నారని వివరించారు. బీజేపీకే బలమైన మెజార్టీ ఖాయమని జోస్యం చెప్పారు.