Balineni Srinivasa Reddy: వైసీపీలో ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న అసంతృప్తి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బయటకు వస్తుంది. ఒక్కొక్కరుగా కినుక వహిస్తూ అసమ్మతిరాగం వినిపించడం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. తాజాగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీపై తిరుగుబావుటా ఎగరవేశారు. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. జగన్ కు బంధువుగా పేరున్న ఆయన్న అంతలా అలకబూనడానికి పార్టీలోని ఓ సీనియర్ నాయకుడే కారణమని స్థానిక నాయకత్వం కూడై కోస్తోంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ అవకాశమిచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ మార్పు చేర్పుల్లో ఆయనను పక్కనబెట్టారు. ఒకానొక దశలో బాలినేని ప్రకాశం జిల్లాలో ఏది చెబితే అదే అధిష్టానం చేసేది. అయితే, వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. రెండోసారి మంత్రివర్గంలో తనకు అవకాశం ఇస్తారని ఆశించారు. అనూహ్యంగా ఆదిమూలపు సురేష్ ను ఎంపిక చేశారు. అందుకు వైవీ సుబ్బారెడ్డే కారణమని బాలినేని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.
బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బావా, బావమరుదులు. రాజకీయాల్లో బంధుత్వాలు అనేవి అన్ని రోజులు పనిచేయవు. స్వప్రయోజనాలే ఉంటాయి. ప్రాధాన్యం గురించి ఆలోచన ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు లేదా ఇతర కారణాలు ఏమైతేనేమీ 2014 ఎన్నికల్లో బాలినేనిని ఓడించేందుకు వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సరిగ్గా పొసగడం లేదు. వైవీ అప్పుడు ఎంపీగా పోటీ చేసి గెలవగా, బాలినేని ఓడిపోయారు. దాంతో టీడీపీకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని రంగంలోకి దింపి వైవీ సుబ్బారెడ్డి చెక్ పెట్టారు.
నెల్లూరు, తిరుపతి, వైయస్‌ఆర్ జిల్లాలకు సమన్వయకర్తగా నియమించబడిన బాలినేని శ్రీనివాసులు ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యం లేని చోట ఉండలేనని అన్నారు. అనారోగ్య కారణాలు, సొంత నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా, ఆయన కోపానికి అసలు కారణాలు వేరని అంటున్నారు. మంత్రి వర్గం నుంచి తప్పించిన తరువాత సురేష్ కు అవకాశమివ్వడం, ఇటీవల మార్కాపురం జగన్ వచ్చిన సందర్భంలో సెక్యూరిటీ ఆపేయడం, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు ఆయనకు చెప్పకుండానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేపట్టడం వంటి తదితర కారణాల తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. వీటన్నింటికి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని బాలినేనికి అనుమానం.
కాగా, వైసీపీపై తిరుగుబావుటా ఎగరవేస్తున్న ఎమ్మెల్యేలో రెడ్డీ సామాజికవర్గానికి చెందిన వారే ఉండటం గమనించదగ్గ విషయం. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో చెలరేగిన బాలినేని ఎపిసోడ్ టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోతుందా లేక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది మరింత ఎక్కువవుతుందా అనేది ఆసక్తికర అంశంగా మారింది. కాగా, మరికొంత మంది అసంతృప్త ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబావుటా ఎగరవేసేందుకు రెడీగా ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు.