
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని చాలా గొప్ప సామెత ఉంది. ఇప్పుడు దాన్ని అక్షరాల నిజం చేసుకుంటున్నారు మన అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట… 151మంది ఎమ్మెల్యేలతో గెలిచి అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా తయారవుతున్నాడు. ఆయనను ఆపడం ఒక్క చంద్రబాబుతో అయ్యే పని కాదు. లోకేష్ అంత బలంగా లేడు. ఈ నేపథ్యంలో విడిపోయిన టీడీపీ, జనసేన ఒక్కటవ్వాలని చూస్తున్న వేళ బాలయ్య మాటలు ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.
*బాబు-పవన్ దోస్తీ దిశగా..
ఏపీలో విడిపోయి పోటీచేసి దారుణంగా దెబ్బతిన్న చంద్రబాబు, పవన్ లు దోస్తీ దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ ఇప్పటికే బీజేపీతో కలిసిపోగా.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని కలుపుకుపోయి త్రిముఖ పార్టీలు కలిసి పోటీచేసి జగన్ ను ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. అలాంటి పొత్తుకు ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయంటున్నారు.. జనసేనతో సంబంధాలు బాలయ్య వ్యాఖ్యలతో దెబ్బతిన్నాయన్న చర్చ టీడీపీలో సాగుతోంది.
*బంధంపై నిప్పులు పోసిన బాలయ్య
తెలంగాణ ప్రభుత్వంతో సినిమాల షూటింగ్ లు, థియేటర్స్ ఓపెనింగ్ కు తనను పిలవలేదని.. భూములు పంచుకుంటున్నారని బాలయ్య సినీ పెద్దలపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఘాటు స్పందించి బాలయ్యను ‘మూసుకొని కూర్చో.. నువ్వు జస్ట్ హీరోవి’ అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో దగ్గరవుదామనుకున్న జనసేన-టీడీపీ బంధానికి బాలయ్య అడ్డుగా మారాడు. బాలయ్య స్వయాన టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిదే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే. సో బాలయ్య నోటి దురుసు అంతిమంగా జనసేనతో సంబంధాల దిశగా అడుగులు వేస్తున్న టీడీపీకి, చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా మారిందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.
*ఏకాకి అవుతోన్న బాలయ్య
ఇక బాలయ్య నోటిదురుసు కేవలం జనసేనతో సంబంధాలనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని, టాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా కెలికినట్టు అయ్యింది. దీంతో ఇప్పుడు అందరూ దూరమయ్యే చాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఊరుకునే అవకాశాలు లేవు. బాలయ్య వ్యాపారాలు, సినిమాలకు అనుమతుల విషయంలో మోకాలడ్డే అవకాశాలున్నాయి. ఇటు సినీ పెద్దలు సైతం బాలయ్యను ఏకాకిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తంగా బాలయ్య నోటి నుంచి వచ్చిన విమర్శలు టీడీపీకి తీవ్ర నష్టం తేగా.. బాలయ్యను సినీ ఇండస్ట్రీలో ఏకాకిని చేశాయనే చెప్పాలి.
-నరేశ్ ఎన్నం