Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్ర శాసనసభకు మే 10న ఎన్నికలు జరగబోతున్నాయి.. దీనికి సంబంధించి అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే నేతలు ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మీడియా ప్రబలంగా ఉన్న నేపథ్యంలో వీటికి బహుముఖ ప్రచారం లభిస్తున్నది. అయితే ఇందులో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయిన పదం భజరంగి. దీనిని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటుండగా, కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. ఇంతకీ ఈ రెండు పార్టీల మధ్య భజరంగీ ఎందుకు వివాదానికి కారణమైందంటే?..
నిషేధాన్ని కొనసాగిస్తాం
కర్ణాటక, కేరళలో బలంగా పాతుకుపోయిన తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ ఐ) మీద కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టం కింద గత సెప్టెంబర్ లో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తామని కర్ణాటక భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తోంది. అయితే దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ విద్వేషాన్ని ప్రోత్సహించే పీఎఫ్ఐ సహా భజరంగ్ దళ్ లాంటి అన్నింటిని నిషేధిస్తామని ప్రకటించింది.. ఇది కాస్త వివాదాస్పదమైంది. దీనిని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంది.. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టింది పేరని కమలం పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి హిందువుల దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదని, భజరంగ్ (హనుమంతుడిని) విమర్శిస్తున్నదని బిజెపి ఆరోపిస్తోంది. ఇదే సమయంలో హిందుత్వా అంశాన్ని బిజెపి చాలా తెలివిగా తెరపైకి తీసుకొచ్చింది. “కరుడుగట్టిన కాషాయ దళమే అయినప్పటికీ, కర్ణాటకలో కొన్నిసార్లు మైనారిటీలపై దాడులకు దిగినా భజరంగ్ దళ్ ను, దేశ వ్యతిరేక పిఎఫ్ఐతో ఒకే గాట కట్టవచ్చా? కానీ తప్పొప్పులు మరిచిన మాటలు పోటీలో ఎవరిని మాత్రం తప్పుపట్టగలం” అని కన్నడ రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.
మోదీ ఆ మాట మరిచారు
కర్ణాటకలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న దేశ ప్రధాని మేనిఫెస్టోలో తమ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను పక్కనపెట్టి.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొత్తం ఆవాస్తవికమని కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ వాటినే అమలు చేయాల్సి గనుక వస్తే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన హామీలు గనుక అమలు చేస్తే ఇప్పటిదాకా బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోతాయంటూ తెరపైకి వితండవాదాన్ని తీసుకొస్తున్నారు. ఇక ఈ పరిణామాన్ని సామాన్యులు హర్షించలేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సంస్థలు చేసిన సర్వేలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని వారంటున్నారు. కానీ కర్ణాటకలో ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్న అమిత్ షా మాత్రం తమకు మెజారిటీ దాటి 15 సీట్లు వస్తాయని చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని వారు వివరిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ మలిదశ జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం గత రెండు దశాబ్దాల్లో కర్ణాటకలో జరగని కథ. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.
బిజెపి ఆకట్టుకుంటుందా?
ముస్లిం రిజర్వేషన్ల రద్దు సహా విభజన రాజకీయాలతో కొత్త ఓటర్లను బిజెపి ఆకట్టుకుంటుందా? 40 శాతం కమిషన్ల అవినీతి సర్కార్ అనే వాదన ఒక్కటే పట్టుకుంటే కాంగ్రెస్ గద్దెను ఎక్కగలదా? 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక 2004 నుంచి ఇప్పటికి 11 మంది ముఖ్యమంత్రులను చూసింది. అయితే కొద్ది సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలో మతోద్రిక్తతలు పెంచడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు స్థిరీకరణ చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే 2018 తర్వాత ఈ అంశంపై ఓట్లు సంతృప్త స్థాయికి చేరాయని, కొత్తగా వచ్చేవి ఏమీ లేవని భారతీయ జనతా పార్టీకి అర్థమైంది. మరి ఎన్నికల చివరి సమరాంగణంలో భజరంగి వివాదం భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తుందా? అనేది ఇప్పుడు మారింది. అంతేకాదు ఓట్ల శాతం లో తలరాత మారే వేళ నిశ్శబ్ద ఓటర్ల మన్ కీ బాత్ కూడా కీలకంగా మారనుంది. అయితే తరచూ ఎమ్మెల్యేల బేరసారాలు చూస్తున్న కన్నడ సీమ ఈసారి హంగ్ తీర్పు ఇవ్వదని, ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇస్తుందని కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరి ఇది నిజం అవుతుందా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే గాని తెలియదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bajrangi on screen during karnataka elections why the conflict between congress and bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com