https://oktelugu.com/

Anjan Kumar Yadav: కాంగ్రెస్ లో “అంజన్” అంటించిన మంటలు

ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు కచ్చితంగా దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 8, 2023 / 05:15 PM IST

    Anjan Kumar Yadav

    Follow us on

    Anjan Kumar Yadav: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధిష్టానానికి వ్యతిరేకంగా టికెట్ రానివారు నిరసనగళం వినిపిస్తున్నారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్లు కన్ఫామ్ చేసుకుంటున్నారు.. అధికార భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఇలా ఉంటే.. తిపక్ష కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మరో విధంగా ఉంది.

    ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు కచ్చితంగా దరఖాస్తులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో నుంచి అయితే భారీగా దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వస్తూ ఉండడంతో వీరందరికీ టికెట్లు కేటాయింపు సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్ మంజూరుకు సంబంధించి ఎవరికీ ఇటువంటి హామీలు ఇవ్వడం లేదు. ప్రజా క్షేత్రంలో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. టికెట్ల కేటాయింపు కూడా అధిష్టానం చూసుకుంటుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

    అంజన్ కుమార్ యాదవ్.. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రెండుసార్లు ఎంపీగా గెలిచాడు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశాడు. దానం నాగేందర్, ముఖేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ వీరు ముగ్గురు హైదరాబాద్ సోదరులుగా ప్రసిద్ధి చెందారు. వేరువేరు సామాజిక నేపథ్యాలకు చెందినవారైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరోగమనం వైపు పయనిచ్చినప్పటికీ.. దానం నాగేందర్ లాంటి బలమైన నేత భారత రాష్ట్ర సమితిలో చేరినప్పటికీ.. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఈయన సికింద్రాబాద్ నుంచి కాకుండా ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ముషీరాబాద్ లో తనకు బంధుత్వం ఉందని, కరోనా సమయంలో తాను ఈ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందించానని గుర్తు చేస్తున్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, అధిష్టానం ఒత్తిడి తనపై ఎక్కువ ఉందని ఆయన చెబుతున్నారు. టికెట్ల కేటాయింపు పూర్తి అయ్యేంతవరకు నేతలందరూ నోరు అదుపులో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి సూచించినప్పటికీ.. అంజన్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. “కెసిఆర్ పెద్దపెద్ద నాయకులను ముషీరాబాద్ లో దించుతున్నాడు. వారందరినీ తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే నా వల్లే అవుతుంది. ఇంకెవరి వల్ల కూడా కాదు” అని అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యనించడం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు దివంగత మాజీ ముఖ్యమంత్రి అంజయ్య వర్గం నాయకులు మాత్రం అంజన్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంజయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ కేటాయించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.