Attacks on hospitals : పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన బెంగాల్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఈ ఘటనపై బెంగాల్ అట్టుడుకుతోంది. ఈ ఘటనకు సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆర్‌జీ కార్ ఆస్పత్రిపై ఆగస్టు 15 రాత్రి దాడి జరిగింది. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు అర్ధరాత్రి ఆర్‌జీ కార్ ఆసుపత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించింది. హాస్పటల్ ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ శుక్రవారం(ఆగస్టు 16న) బెంగాల్‌లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ నర్సులు ఆందోళన చేశారు.
ఆస్పత్రిపై దాడి.. కేంద్రం సీరియస్..
ఆర్‌జే కార్ ఆసుపత్రిలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించిన ఘటనను కేంద్ర ఆరోగ్యశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈనేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆస‍్పత్రులకు శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఆస‍్పత్రి ప్రాంగణం లేక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు పోలీసులు చర్యలు చేపట్టాలని తెలిపింది. కేసు నమోదు చేయాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆస‍్పత్రి హెడ్ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర వైద్యసిబ్బందిపై దాడులు సర్వసాధారణమైనట్లు మా దృష్టికి వచ్చింది. విధుల్లో భాగంగా పలువురు సిబ్బంది శారీరక హింసకు గురయ్యారు. మరికొందరికి బెదిరింపులు వచ్చాయి. ఇందులో ఎక్కువ శాతం రోగి లేక రోగి వెంట వచ్చిన వారివల్ల ఎదుర్కొన్నవే దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి” అని కేంద్రం వెల్లడించింది.
సీబీఐకి సాక్షాలు చిక్కకుండా..
ఇటీవల బెంగాల్ లోని ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో ఓ జూనియర్ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురయ్యారు. దానిని నిరసనగా జరిగిన ఆందోళనల్లో ఆ ఆసుపత్రిపై దాడి జరిగింది. ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. సీబీఐకి సాక్ష్యాలు చిక్కకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆసుపత్రిపైకి తృణమూల్ గూండాలను పంపారని బీజేపీ ఆరోపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలను మమత తిప్పికొట్టారు. దాడుల వెనుక పలు రాజకీయ పార్టీల హస్తం ఉందని ప్రత్యారోపించారు. నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, వైద్యులతో తనకు ఎటువంటి ఫిర్యాదు లేదని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఆసుపత్రిపై జరిగిన దాడులను భారత వైద్య సంఘం(ఐఎంఏ) ఖండించింది. ఈ విధ్వంసంపై కోల్‌కతా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Attacks on hospitals sensational decision of the centers health department
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com