Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ చేయి దాటి పోతోందా?

YCP: వైసీపీ చేయి దాటి పోతోందా?

YCP: వైసీపీకి బలమైన ఓటు బ్యాంకులో ఎస్సీలు ఒకరు. వైసిపి ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి వారి మద్దతు ఒక కారణం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి. సొంత పార్టీ శ్రేణులే దాడులకు పాల్పడుతుండడం.. వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుండడాన్ని దళితులు గుర్తిస్తున్నారు. అందుకే ఎదురు తిరుగుతున్నారు. అభిమానించే పార్టీనే వ్యతిరేకించడం ప్రారంభించారు. రాష్ట్ర హోం మంత్రికి సొంత నియోజకవర్గంలోనే దళితుల నుంచి నిరసన ఎదురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి. కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు స్పందించడానికి ముందుకు రావడం లేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఎప్పుడైనా స్పందిస్తే.. ఆయన పదవి నుంచి తీసేస్తామని బెదిరింపులకు దిగేవారు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. కరోనా సమయంలో సరైన వసతులు లేవన్న దళిత డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే. చివరకు దళిత యువకులను హత్య చేసి డోర్ డెలివరీ చేసినా చర్యలు లేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. తాజాగా హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరులో ఓ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వైసిపి నేతలే కారణమని వాంగ్మూలం ఇచ్చి మరి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులు, చిన్న చూపు పై ఆ వర్గాల్లో అంతర్మధనం ప్రారంభమైంది. అందుకే రహదారుల పైకి వచ్చి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్నది అధికార వైసీపీకి చెందిన జడ్పిటిసి సమీప బంధువు. కేవలం పార్టీలో ఆధిపత్య పోరులోనే ఈ ఘటన జరిగింది. సమస్యను పరిష్కరించాల్సిన హోం మంత్రి జాప్యం చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. దొమ్మేరులో ఇప్పుడు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. పోలీసులు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోంది. అటు హోం మంత్రి సొంత నియోజకవర్గంలో ఉండకుండా విజయవాడ వెళ్ళిపోయారు. ఈ ఘటనపై సిఐడి విచారణ చేయిస్తానని ఆమె చేసిన ప్రకటన కూడా వివాదాస్పదమవుతోంది. సిఐడి విచారణ అంటేనే ఒక రకమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇటువంటి తరుణంలో ఆ సీఐడీ ఇటువంటి నివేదిక ఇస్తుందో వైసిపి శ్రేణులకు తెలుసు. అందుకే హోం మంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ఘటనకు బాధ్యులను అరెస్టు చేసి.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల విషయంలో జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలపై ఫుల్ క్లారిటీ వస్తోంది. తమను ఓటు బ్యాంకుగా మలుచుకున్న జగన్.. తమను ఎలా తొక్కి పెట్టారు దళితులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. దశాబ్దాలుగా రాజ్యాంగబద్ధపు హక్కులు, రాయితీలను తొలగించారు. గతంలో వచ్చిన సంక్షేమ పథకాలు సైతం నిలిపివేశారు. కేవలం నవరత్నాల్లో తమకు అందిన సాయాన్ని లెక్క కట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దళితుల కోసం ప్రత్యేక ప్రాజెక్టు కానీ, పథకం గానీ ప్రకటించలేదు. కానీ తమపై జరుగుతున్న దురాగతాల విషయంలో సైతం జగన్ సర్కార్ సరిగ్గా స్పందించడం లేదు. సర్కారులు భాగస్తులైన ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం ప్రభుత్వం కట్టడి చేస్తుందన్న అనుమానం దళితుల్లో వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి బలమైన వర్గంగా ఉన్న ఎస్సీలు జగన్ కు దూరమవుతుండడంతో అధికార పార్టీలో సైతం ఆందోళన నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular