Attacks YCP Leaders On Officers: వారికి నిబంధనలతో పనిలేదు. పనిచేయమని ఆదేశాలిస్తారు. చేయకపోతే చెంపలు పగలగొడతారు. లేకుంటే శంకరగిరి మన్యాలు పాటిస్తారు. ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధులు అధికారులు, ఉద్యగులు వ్యవహరిస్తున్న తీరిది. విశాఖలో డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ నుంచి తాజాగా ఇరిగేషన్ ఏఈ సూర్యకిరణ్ పై చెప్పుదెబ్బల వరకూ రాష్ట్రంలో వైసీపీ మార్కు రాజకీయం నడుస్తోంది. వైసీపీ విపక్షంలో ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళా తహసీల్దార్‌పై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేశారంటూ రచ్చరచ్చ చేశారు. ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చారు. ఉద్యోగుల క్షేమం, భద్రత తమకు ఎంతో ముఖ్యమనే ‘కలరింగ్’ ఇచ్చారు. అధికారంలోకి రాగానే… అసలు రంగు బయటపెట్టారు. ‘తిడితే తిట్టించుకోవాలి. కొడితే కొట్టించుకోవాలి. వ్యవహారం జఠిలమైతే ఓ సారి చెబుతాం. లేదంటే, అదీ ఉండదు. అన్నట్టుంది వైసీపీ నేతల తీరు. రాష్ట్రవ్యాప్తంగా తరచూ ఉద్యోగులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల నేతలు… మరికొన్ని చోట్ల కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ మనసెరిగి నడుచుకోని ఉద్యోగులను నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా, వేధింపులకు పాల్పడుతున్నా.. పోలీసులు కేసులు నమోదు చేయడంలేదు. వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిపై వేధింపులు, ఒత్తిళ్లు నిత్యకృత్యం. ‘ఈ ప్రభుత్వం మాది. మా దయా దాక్షిణ్యంవల్లే మీకు ఉద్యోగాలు వచ్చాయి. మేం చెప్పింది చేయాల్సిందే’ అనే తరహాలో చోటామోటా నాయకులు రెచ్చిపోతున్నారు. బూతులు తిట్టడం, దాడులు చేయడం పరిపాటిగా మారిపోయింది.
కొనసాగుతున్న దాడులు
కొవిడ్ ఎంత ప్రభావం చూపిందో తెలియంది కాదు. ఆ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వైద్యసేవలందించారు. అప్పట్లో వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేయలేదని చెప్పినందుకు నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను అరెస్టు చేసి నానా ఇబ్బందులు పెట్టారు. చివరకు ఆయన మరణానికి కూడా కారణమయ్యారు. తాజాగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇరిగేషన్ ఏఈ సూర్యకిరణ్‌ను మూడుసార్లు చెంప మీద కొట్టారు. కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు గుడివాడలో ఆయన సమక్షంలోనే దళిత తహసీల్దార్‌పై దాడి జరిగింది. ఓ థియేటర్ యజమాని కొన్ని అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్‌పై దాడి చేశారు.
Also Read: Movie Tickets Online : ఏపీలో సినిమా టికెట్లు ఇక ఆన్ లైన్.. ‘సర్కారు వారి కమీషన్’ 2 శాతం
మట్టి అక్రమాలను అడ్డుకున్నందుకు గుడివాడలో అప్పటి మంత్రి కొడాలి నాని అనుచరులు ఆర్‌ఐని కొట్టి జేసీబీతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.ఈ ప్రభుత్వం అధికారంలోకివచ్చిన కొత్తలోనే… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇంటిపై దాడిచేయడం సంచలనం కలిగించింది.ప్రోటోకాల్ పాటించడం లేదంటూ గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేశ్ నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌పై చిందులు వేశారు.
మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ అధికారి బిత్తరపోయారు. అధికారపార్టీ నాయకుడి వేధింపులు తాళలేక కృష్ణా జిల్లా బందరు మండలం బోగిరెడ్డిపల్లి వీఓఏ గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం, కొండగూడెం వీఆర్వో సుశీల… తనపై ఆ గ్రామ వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు మరికొందరు దాడి చేశారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.గుంటూరు జిల్లా వినుకొండలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసిన తహసీల్దార్ వెంకటేశర్లును వైసీపీ కార్యకర్త కాలర్ పట్టుకుని నానా యాగీ చేశారు. ఆ కార్యకర్తపై కేసు పెడితే ఊరుకునేది లేదని తహసీల్దార్‌ను ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హెచ్చరించారు.ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా విడుదల కాలేదని నగరి మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేసినందుకు మున్సిపల్‌శాఖ ఆయనను సస్పెండ్ చేసింది.చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరిగపల్లిలో స్థానిక వైసీపీ నాయకులు జయప్రకాశ్‌రెడ్డి సచివాలయ ఉద్యోగి సతీశ్‌పై దాడిచేశారు.ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో తమకు అనుకూలంగాలేరని ప్రకాశంజిల్లాలో దళిత ఎంపీడీఓ కృష్ణను జడ్పీ సీఈఓకు సరెండర్ చేశారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని కోర్టు కెళ్లిన సిబ్బందిపై వేధింపులకు దిగారు.
రాజకీయ ఒత్తిళ్లు
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను ఇప్పటికీ బిల్లలు చెల్లించడం లేదు. ఉపాధి హామీ, నీరుచెట్టు పథకానికి సంబంధించి పనులను నిలిపివేసింది. గతంలో వేసిన సిమెంట్ రోడ్లకు బిల్లులివ్వకపోవడంతో మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇంజనీర్లను వాడుకుంది. ఎప్పుడో పూర్తయిన పనులను తనిఖీ చేయాలని ఆదేశించింది. లేని లొసుగులను వెతికి పట్టుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అంటే… ఇంజనీర్లు గతంలో తమ ఆధ్వర్యంలో జరిగిన పను ల్లో అవినీతి జరిగిందని తామే నిర్ధారించాలన్న మాట! రాజకీయ లక్ష్యాల కోసం తమను వాడుకోవద్దని ఇంజనీర్లు వేడుకున్నా ఫలితం లేదు. సీసీ రోడ్లపై విజిలెన్స్, ఏసీబీ వేధింపులతో ఇంజనీర్లు ఇబ్బందుల్లో పడ్డారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
Also Read:BJP vs KCR: కేసీఆర్ తో ఫైట్.. తెలంగాణ బీజేపీ నేతలకు సంచలన ఆదేశాలు