AP Assembly : ఇప్పటివరకూ మాటలతో హింసించారు. రాజకీయ ప్రత్యర్థులను చిత్రవధ చేశారు. ఇప్పుడు ఏకంగా దాడులు చేస్తున్నారు. ఏపీ శాసనసభ ఔన్నత్యాన్ని మంటగలిపే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులకు తెగబడ్డారు. కానీ ఆ వీడియోలేవీ బయటపడకుండా జాగ్రత్తలు పడ్డారు. ఫ్రీప్లాన్ గా చేసుకొని సహచర ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అసెంబ్లీలో అనేక చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై వ్యక్తిగత కామెంట్స్ రోజురోజుకూ శృతిమించాయి. చివరకు మాజీ సీఎం చంద్రబాబు సతీమణిపై హౌస్ లో విపరీత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కంటతడి పెట్టించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ విష సంస్కృతి రాలేదు. అప్పట్లో విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అప్పటి అధికార పక్షానికి చుక్కలు చూపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రెట్టింపు చేస్తున్నారు.
సభకు రండి తేల్చుకుందాం అంటూ చాలాసార్లు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలకు హెచ్చరించారు. మీ అంతు చూస్తాం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే దాడులకు తెగబడ్డారు. వాస్తవానికి చంద్రబాబు తాను సీఎంగానే మళ్లీ హౌస్ లో అడుగుపెడతానని ప్రతినబూనారు. అటు టీడీపీ శాసనసభాపక్షం కూడా ఇదే నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీని బాయ్ కట్ చేయాలని భావించింది. కానీ ప్రజాసమస్యల పరిష్కరానికిగాను శాసనసభకు వెళ్లాలని నిర్ణయించుకుంది. సంఖ్యాబలంగా తక్కువగానే ఉన్నా గట్టిగానే పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలపై మాటల తూటాలు, వ్యక్తిగత అస్త్రాలు సంధిస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా కించపరుస్తునే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తూంటే ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి పాల్పడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. పక్కా ప్లాన్ ప్రకారం ఎవరు ఎవరిపై దాడిచేయాలో ముందుగా నిర్ణయించుకున్నట్లుగా టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దాడి చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి శ్రీనివాస్ దాడి చేశారు. సుధాకర్ బాబు దాడి చేయడంతో ఒక్క సారిగా అసెంబ్లీలో లైవ్ ఆపేశారు. దృశ్యాలు కనిపించకుండా చేశారు. సుధారర్ బాబును అడ్డుకునేందుకు టీడీపీ నేతుల ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది . దీంతో సభను స్పీకర్ హడావుడిగా వాయిదా వేశారు. తర్వాత టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ీ అంశంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. స్పీకర్ సమక్షంలోనే తమ పై దాడి జరిగిందని… మొత్తం వీడియోను బయట పెట్టాలని శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
అయితే దాడులు చేయడం, దబాయించడం వైసీపీకి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు జరిగాయని.. శాసనసభలోని వీడియోలు బయటపెడితే అంతా తెలిసిపోతుందని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ మాత్రం టీడీపీ సభ్యులే స్పీకర్ పై దాడిచేసేందుకు ప్రయత్నించారని కొత్త ఆరోపణలు చేస్తున్నారు. దాడులు అనేవి వైసీపీకి కామన్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. ప్రశ్నించే వారిపై దాడులు జరపడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా చట్టసభ ఔన్నత్యాన్ని చెడగొట్టేలా వీధి గుండాల్లా ఎమ్మెల్యేలు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి వాతావరణాన్ని సహించలేక విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపినా.. వైసీపీ ప్రజాప్రతినిధుల్లో మాత్రం మార్పురాకపోవడం విశేషం. వినాశకాలే విపరీత బుద్ధి అని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీకి ఇటువంటి చర్యలే ముప్పుగా పరిణమిస్తున్నాయని చెబుతున్నారు.