
ఒక వర్గం వారు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. కొట్టారు. పోలీస్ వాహనాలకు నిప్పంటించారు. పోలీస్ స్టేషన్ లోనే దాడి చేసి నానా బీభత్సం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ వర్గంపై కేసులు ఎత్తివేసింది. స్వయంగా డీజీపీ ప్రభుత్వానికి లేఖ రాయగా.. ప్రభుత్వం కేసులను ఎత్తివేసింది. అయితే కొందరు ఇది అన్యాయమంటూ హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తాజాగా నిలుపుదల చేసింది.
2018లో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన విషయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. రాత్రికి రాత్రి కొంతమంది గుంపు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ ఘటన ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని అప్పట్లో పోలీసులు నిర్ధారించారు. వారిపై కేసులు పెట్టారు. దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులపై ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటూ వైసీపీ ప్రభుత్వానికి ఫిబ్రవరి 17న డీజీపీ లేఖ రాశారు. ఆ లేఖను ఆమోదిస్తూ ఆగస్టు 12న ఏపీ ప్రభుత్వం 776 జీవో విడుదలైంది.
ఈ అంశంపై తాజాగా ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం’ నుంచి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తమ వాదనలు వినిపించారు. సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ పైనే జరిగిన దాడిలో పోలీసులు ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని.. ఇటువంటి నేరాలు భవిష్యత్తులో పునరావృతం అయ్యేందుకు ఈ జీవో తావిస్తోందని.. దీనిపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపించాలని హైకోర్టును పిటీషనర్ కోరారు.
కాగా ఈ జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోపైన భాషపైన న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు. జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని న్యాయమూర్తులు తప్పుపట్టారు.
పిటీషన్లో ఎన్ఐఏని కూడా పార్టీగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. సదురు జీవో నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదికి ధర్మాసనం వాయిదావేసింది.