https://oktelugu.com/

Assembly Elections: తెలంగాణ ఎన్నికల హీట్ మొదలైంది.. ఇక ప్రచారమే!

ఎన్నికల అధికారులు తమ యొక్క సొంత జిల్లాల్లో పని చేయరాదని.. ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి పని చేయరాదని తాజా నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే క్రిమినల్‌ కేసులు లేవని డిక్లరేషన్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 3, 2023 / 10:18 AM IST

    Assembly Elections

    Follow us on

    Assembly Elections: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపించింది. ఈ క్రమంలో ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగులపై నివేదికను జులై 31 వరకు ఇవ్వాలని సీఈవోలను ఆదేశించింది.

    సొంత జిల్లాలో ఉండొద్దు..
    ఎన్నికల అధికారులు తమ యొక్క సొంత జిల్లాల్లో పని చేయరాదని.. ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి పని చేయరాదని తాజా నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే క్రిమినల్‌ కేసులు లేవని డిక్లరేషన్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

    వీరికి బదిలీ తప్పదు..
    ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు, తహసీల్దార్లు, ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్లు, ఇన్‌స్పెక్టర్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఈ మేరకు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సీఈవోలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బదిలీలు, పోస్టింగుల విషయమై జూలై నెలాఖరు వరకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

    డిసెంబర్‌లో ఎన్నికలు..
    ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటూ మద్దతును కోరుతున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఈ క్రమంలో సీఈసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్‌ అయింది.

    బదిలీలు, పోస్టింగులపై దృష్టి..
    బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన వివరాలపై ఈసీ మొదట దృష్టిపెట్టింది. ఆ లిస్ట్‌ అందాక.. ఓటర్ల జాబితాపై కసరత్తు చేస్తుంది. అన్నీ ఓకే అయ్యాక ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ చేసే అవకాశాలున్నాయి. అయితే ఈలోపు పార్టీలన్నీ కూడా మరింత స్పీడ్‌ పెంచనున్నాయి. టికెట్లు మళ్లీ తమకే కావాలని సిట్టింగులు అడుగుతుండగా.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఏదేమైనా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.

    మిగతా నాలుగు రాష్ట్రాలకు కూడా..
    తెలంగాణ అసెంబ్లీ గడువు 2024, జనవరి 16తో ముగియనుండగాం మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్‌ 17, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌ గడువు జనవరి 3,6 తేదీలతో ముగియనుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ అదేశాలు జారీ చేసింది. 5 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ, వ్యయం సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్వహించే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తుంది.