Ashok Gajapathi Raju: విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పూసపాటి అశోక్ గజపతిరాజు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ జిల్లా పెత్తనం రాజు గారిదే. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటూ ఉండదు. రాజు గారి బంగ్లానే దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా కొనసాగుతోంది. జిల్లాలో తూర్పు కాపులు, వెలమ సామాజిక వర్గం అధికంగా ఉన్నా పార్టీ పెత్తనం మాత్రం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ దే. అయితే రాజుగారి నుంచి పెత్తనం క్రమేపి జారుతుండడం విశేషం.
1978లో అశోక్ గజపతిరాజు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనతా పార్టీ నుంచి ఆయన ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఆయనను గౌరవించి పోలిట్ బ్యూరోలోకి తీసుకుంది. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అశోక్ గజపతిరాజు కీలక పోర్టు పోలియోలను దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో మాత్రం విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కితే.. అందులో అశోక్ గజపతిరాజుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. అంతలా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యమిచ్చింది. అయితే ఎంపీగా పోటీ చేయడంతో జిల్లాపై అశోక్ పట్టు తప్పింది. ఇతరుల చేతిలోకి పెత్తనం వెళ్ళింది.
అందుకే 2024 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి, కుమార్తెను ఎంపీగా బరిలో దించాలని అశోక్ చూస్తున్నారు. కానీ చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. కేవలం అశోక్ ని విజయనగరం అసెంబ్లీకి పరిమితం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. విజయనగరం ఎంపీగా కళా వెంకట్రావు తో పోటీ చేయించాలని చూస్తున్నారు. పార్లమెంటరీ పరిధిలో తూర్పు కాపులు అధికం. ఆయన మరదలు కిమిడి మృణాళిని చీపురుపల్లి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. మంత్రి పదవి చేపట్టారు. ఆమె కుమారుడు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. కళా వెంకట్రావు సొంత నియోజకవర్గంలో రాజాం సైతం విజయనగరం పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. అటు కళా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం సైతం విజయనగరం పార్లమెంట్ పరిధిలోనిదే. ఒకవేళ కళా వెంకట్రావు బరిలో దిగి విజయం సాధిస్తే.. విజయనగరం పై ఆయన పట్టు పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే దీనిపై అశోక్ ముందస్తుగానే ఆలోచించారు. విజయనగరం ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలని అశోక్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రాజుగారు నొచ్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆశిస్తున్నారు. అశోక్ అయితేనే ఆమె సహకరించే అవకాశం ఉంది. అశోక్ కుమార్తె బరిలో దిగితే మాత్రం గీత నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు అశోక్ కు తెగేసి చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే నాలుగు దశాబ్దాల పాటు విజయనగరం టిడిపిలో మకుటం లేని రాజుగా ఎదిగిన అశోక్ గజపతి రాజు పెత్తనానికి పడనుండడం విశేషం.