Central Government Debt: ఏపీ, తెలంగాణలకే కాదు.. కేంద్రానికి అప్పులున్నాయి.. ఎన్ని లక్షల కోట్లంటే?

2022–23 లెక్కల ప్రకారం కేంద్ర అప్పులు జీడీపీలో 71%కి చేరితే, రాష్ట్ర రుణాలు 35% శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : July 28, 2023 2:41 pm

Central Government Debt

Follow us on

Central Government Debt: ఇటీవల రాష్ట్రాల అప్పులు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అప్పులు పెరిగిపోయాయి. ఏపీలో చూసుకుంటే గత నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. కాదు కాదు 4 లక్షల కోట్లే అంటూ అధికార వైసీపీ చెబుతుంది. టీడీపీ రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని పేర్కొంటుంది. సంక్షేమ పథకాల అమలుకే రాష్ట్రం తెస్తున్న అప్పులు సరిపోతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్‌ సర్కారు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నదనే అపవాదు మూటగట్టుకున్నది. ధనిక రాష్ట్రమంటూ చెబుతూనే సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పను పెంచుకుంటూ పోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సకాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని, ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని టాక్‌ నడుస్తున్నది.

దేశం అప్పు 220.5 లక్షల కోట్లు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.220.5 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌదరి తెలిపారు. జీడీపీలో వీటి శాతం 80.9%కి చేరినట్లు వెల్లడించారు. రాజ్యసభలో సీపీఎం ఎంపీ శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. 2018–19లో రూ.93.3 లక్షల కోట్ల మేర ఉన్న కేంద్రం అప్పులు 2022–23 నాటికి రూ.155.6 లక్షల కోట్లకు చేరినట్లు చెప్పారు. అయిదేళ్లలో అప్పులు రూ.62.3 లక్షల కోట్లమేర (66.77%) పెరిగినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు రూ.47.9 లక్షల కోట్ల నుంచి రూ.76.1 లక్షల కోట్లకు ఎగబాకినట్లు తెలిపారు. రాష్ట్రాల అప్పులు అయిదేళ్లలో రూ.28.2 లక్షల కోట్లు పెరిగినట్లు వెల్లడించారు. ఇందులో 58.87% మేర వృద్ధి నమోదైనట్లు వివరించారు.

జీడీపీలో 71 శాతం..
2022–23 లెక్కల ప్రకారం కేంద్ర అప్పులు జీడీపీలో 71%కి చేరితే, రాష్ట్ర రుణాలు 35% శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. గడిచిన ఐదేళ్లలో కేంద్రం అప్పుల శాతం జీడీపీ పరంగా చూస్తే.. 201819లో 70 శాతం, 201920లో 70 శాతం, 202021లో 70 శాతం, 202122లో 71 శాతం, 202223లో 71 శాతంగా ఉంది. ఇక రాష్ట్రాల అప్పులు జీడీపీలో..
2018–19లో 36శాతం, 2019–20లో 35 శాతం, 2020–21లో 35 శాతం, 2021–22లో 35 శాతం, 2022–23లో 35 శాతం ఉంది.

కేంద్ర, రాష్ట్రాల అప్పు మొత్తం కలిపితే… జీడీపీలో 2018–19లో 70.4 శాతం, 2019–20లో 75.2 శాతం, 2020–21లో 87.8 శాతం, 2021–22లో 83.9 శాతం, 2022–23లో 80.9 శాతంగా ఉంది. అంటే కేంద్రం ఆక్షల కారణంగా రెండేళ్లుగా అప్పుల శాతం తగ్గుతోంది.

ఆందోళన కరంగా లెక్కలు..
దేశం అప్పుల లెక్కలు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. ఈ డబ్బంతా ప్రజా సంక్షేమం కోణంలోనే ఖర్చు చేశారా.. లేదంటే దుబారాగా వాడేశారా అనేది కేంద్రం మాత్రమే చెప్పగలదు. అయితే కొంత కాలంగా రాష్ట్రాలు తీసుకునే అప్పు తగ్గింది. దీనికి కారణమెంటంటే కేంద్రం విధించిన అంక్షలే.. రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నాయనే ఆరోపణలు నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి, అప్పలపై అంక్షలు విధించింది, ఇకపై కేంద్రం అనుమతి లేనిదే రాష్ట్రాలకు అప్పులు పుట్టవు. దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. అయితే కేంద్రంతోపాటు రాష్ట్రం తీసుకున్న అప్పులు ఎలా ఖర్చు పెడుతున్నారనే విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై పర్యవేక్షణ లేకపోతే నిధులన్నీ పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.